రిలయన్స్‌ పార్కులో సామూహిక వివాహాలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ వివాహాన్ని పురస్కరించుకుని మంగళవారం పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు.

Published : 03 Jul 2024 05:22 IST

వధువులకు రూ.లక్ష చొప్పున స్త్రీధనం అందజేత

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ వివాహాన్ని పురస్కరించుకుని మంగళవారం పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌ ఇందుకు వేదికైంది. దీనికి ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్‌ హాజరయ్యారు. అలాగే కొత్త జంటల తరఫున కొందరు బంధువులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముకేశ్‌ కుటుంబం పేర్కొంది. ఈ సందర్భంగా కొత్త జంటలకు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు పంపిణీ చేశారు. అలాగే పెళ్లి కుమార్తెలకు స్త్రీధనం కింద రూ.1.01 లక్షల చొప్పున చెక్కులు అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. అతిథులందరికి భారీ విందు ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే.. పారిశ్రామికవేత్త వీరెన్‌ మర్చెంట్‌ కుమార్తె రాధికతో అనంత్‌ అంబానీ వివాహం ఈ నెల 12న జరగనుంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడ్రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని