ఆగస్టులో ‘నీట్‌-పీజీ’

నీట్‌-పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు.

Published : 03 Jul 2024 03:46 IST

ఈ వారంలో వెలువడనున్న షెడ్యూల్‌

దిల్లీ: నీట్‌-పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. నీట్‌ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఈ నెల  2న ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. నీట్‌-పీజీ ఏర్పాట్లపై సోమవారం కేంద్ర హోంశాంఖ సంబంధిత విభాగాల అధికారులతో చర్చలు నిర్వహించింది. 

రెండు గంటల ముందే ప్రశ్నపత్రం

మరోపక్క నీట్‌-యూజీ పేపర్‌ లీకేజ్‌ వివాదం నేపథ్యంలో నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఆన్‌లైన్‌లో నిర్వహించబోయే నీట్‌-పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

‘నీట్‌-యూజీ’పై 8 నుంచి సుప్రీం విచారణ

దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 26 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో తాజా అప్‌డేట్‌ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని