భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు

బయటి ప్రపంచానికి భారత్‌పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్‌ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 05:37 IST

దేశంపై దాడి జరిగినప్పుడల్లా ఒక్కటిగా నిలిచారు
యుద్ధ వీరుడు అబ్దుల్‌ హమీద్‌ జయంతి కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌ 

గాజీపుర్‌: బయటి ప్రపంచానికి భారత్‌పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్‌ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. యుద్ధ వీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత అబ్దుల్‌ హమీద్‌ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌ జిల్లా ధమాపుర్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగవత్‌ ఈ మేరకు ప్రసంగించారు. ‘‘అసంఖ్యాక భాషలు, ప్రాచీన సంప్రదాయాలతో భారత్‌ అలరారుతోంది. ఇక్కడ ఎన్నో రకాల ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి. ఇన్ని వైరుధ్యాలున్నా భారత్‌ వేల సంవత్సరాలుగా ఒకే దేశం, సమాజంగా నిలిచింది. చైనా, పాకిస్థాన్‌ యుద్ధాల సమయంలోనే కాదు.. దేశంపై ఎప్పుడు దాడి జరిగినా భారతీయులు తమ వైరుధ్యాలను మరిచి ఒక్కటయ్యారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మూలాల్లో ఉండటంతోనే ఇది సాధ్యమైంది. ఇక్కడి ప్రజలు మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు, భక్తితో ఆరాధిస్తారు. దేశం కోసం చెమట, రక్తం ధారబోసిన మన పూర్వీకుల సిద్ధాంతాలు, ప్రాచీన సంస్కృతి మనల్ని ఐక్యంగా ఉంచుతున్నాయి. అబ్దుల్‌ హమీద్‌ లాంటి వీరులు మనలో నిజమైన స్ఫూర్తిని నింపుతున్నారు’’ అని భాగవత్‌ పేర్కొన్నారు. 1965లో చైనాతో జరిగిన యుద్ధంలో పోరాడిన అబ్దుల్‌ హమీద్‌ జీవితంపై ఆయన కుమారుడు ప్రచురించిన ‘మేరే పాపా పరమ్‌వీర్‌’ పుస్తకాన్ని భాగవత్‌ ఆవిష్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని