సంక్షిప్త వార్తలు

ప్రస్తుత రైల్వే టైం టేబుల్‌ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్‌ను ఏటా జూన్‌ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.

Updated : 02 Jul 2024 05:46 IST

రైల్వే టైం టేబుల్‌లో మార్పులు లేవు

దిల్లీ: ప్రస్తుత రైల్వే టైం టేబుల్‌ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్‌ను ఏటా జూన్‌ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి. జులై 1 నుంచి తదుపరి ఏడాది జూన్‌ 30 వరకూ నూతన టైం టేబుల్‌ అమల్లో ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం డిసెంబరు 31 వరకు ప్రస్తుత టైం టేబుల్‌నే కొనసాగించాలని రైల్వే బోర్డు 17 జోన్ల జనరల్‌ మేనేజర్లకు జూన్‌ 27న సర్క్యులర్‌ జారీ చేసింది.  


నేడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం

దిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో తొలిసారిగా మోదీ మంగళవారం సమావేశం కానున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు భాజపాకు సొంతంగా దక్కకపోవడం, మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి రావడంతో ఈ సమావేశంలో ప్రధాని పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 


సీబీఐ అరెస్టుపై దిల్లీ కోర్టులో కేజ్రీవాల్‌ సవాల్‌

దిల్లీలో మద్యం విధానం కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టులో సోమవారం సవాల్‌ చేశారు. అలాగే జూన్‌ 26న మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వాలన్న ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులనూ కేజ్రీవాల్‌ సవాల్‌ చేశారు. జూన్‌ 29న ట్రయల్‌ కోర్టు ఆయనను జులై 12 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపింది. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్‌ 26న తిహాడ్‌ జైలు నుంచి అరెస్టు చేసింది.


చైనా వాదనల్లో పస లేదు 

ఆసియాలో పలు భూభాగాలు, సముద్ర జలాలు తమవేనంటూ చైనా వినిపిస్తున్న వాదనల్లో పస లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా.. చరిత్ర ప్రకారం పరిశీలించినా ఆ దేశ వాదనలు దాదాపుగా చెల్లవు. అందుకే- తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హిమాలయాలు.. ఇలా ప్రతి అంశంలో చైనా వింతగా మాట్లాడుతుంటుంది. చారిత్రక ఆధారాలు లేనప్పటి నుంచీ అవన్నీ తమ సముద్ర, భూ భాగాలేనని చెబుతుంటుంది. 

 బ్రహ్మ చెలానీ, భౌగోళిక వ్యవహారాల నిపుణులు


పీఎల్‌ఐ పథకాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు! 

కేంద్ర బడ్జెట్‌ సమీపిస్తున్నవేళ- ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) కోసం భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. పీఎల్‌ఐ గురించి చాలామంది సరిగా అర్థం చేసుకోలేదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఈ పథకం ప్రతి రంగంలోని సవాళ్లను పరిష్కరించేది కాదు. భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారబోయే కొన్ని రంగాల్లో ఐదేళ్లలో ఉత్పత్తి, పోటీతత్వాన్ని భారీగా పెంచేందుకు పీఎల్‌ఐని తీసుకొచ్చాం. భారత ఉత్పాదకతను అంతర్జాతీయ స్థాయికి పెంచాలన్నది దాని లక్ష్యం. 

 అమితాబ్‌ కాంత్, నీతీ ఆయోగ్‌ మాజీ సీఈవో 


ఆ క్రిమినల్‌ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలెక్కువ

ఉద్యోగం/పెళ్లి పేరుతో మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకునే వ్యక్తులకు పదేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించేందుకు కొత్త క్రిమినల్‌ చట్టమొకటి వీలు కల్పిస్తోంది. ఇది ఆందోళనకర విషయమే! ఎందుకంటే ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పరస్పర సమ్మతితో కొనసాగించిన సంబంధాలనూ దీనిద్వారా నేరాలుగా చూపే ముప్పుంది. తగిన పరిశీలన/చర్చ లేకుండా ఇలాంటి క్రిమినల్‌ చట్టాలను ఆమోదించడమేంటి? 

 రాజ్‌దీప్‌ సర్దేశాయ్,పాత్రికేయుడు 


పనిమనుషులకు కనీస మర్యాద ఇవ్వరు!

తమ ఇంట్లో పనిచేసేవారి విషయంలో శ్రమదోపిడీకి పాల్పడినందుకు హిందూజా కుటుంబానికి విదేశాల్లో జైలుశిక్ష ఖరారైంది. ఒకవేళ అవే ప్రమాణాలను మన దేశంలో వర్తింపజేస్తే ఏం జరుగుతుంది? ఎంతమంది యజమానులు దోషులుగా తేలుతారు? మనలో చాలామంది.. ఇళ్లలో పనిమనుషులకు కనీస మర్యాద ఇవ్వరు. వారికి సెలవులివ్వరు. వేతనాలూ పెంచరు. 

 వీర్‌ సాంఘ్వీ, పాత్రికేయుడు 


నీట్‌-యూజీ ఓఎంఆర్‌ షీట్‌ అవకతవకలు..రెండు వారాల తరవాత విచారించనున్న సుప్రీంకోర్టు

దిల్లీ: వివాదాస్పద నీట్‌-యూజీ, 2024 ఓఎంఆర్‌ షీట్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రెండు వారాల అనంతరం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. తన ఓఎంఆర్‌ షీట్‌ మారిపోయిందంటూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పిటిషన్‌ జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ నేతృత్వంలోని సెలవుకాల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై రెండు వారాల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. 


వైస్‌ ఛాన్సలర్‌ ఇకపై కులగురు

మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌ ఆమోదం 

భోపాల్‌: విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్‌ (ఉప కులపతి) పదవిని ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తెలిపారు. అన్ని యూనివర్సిటీల వీసీలను ఇకపై కులగురువులుగా సంబోధించనున్నట్లు వెల్లడించారు. ‘ఉప కులపతి అనే పదం కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ఉప కులపతి భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా మారింది’ అని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని