సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ

దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

Published : 02 Jul 2024 04:15 IST

దిల్లీ: దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈశాన్య, వాయవ్య, తూర్పు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా అన్నిచోట్లా ఇలాగే ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర సోమవారం విలేకరులకు తెలిపారు. జులైలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెం.మీ. కాగా ఈసారి అంతకుమించి (106% మేర) వానలు పడతాయని చెప్పారు. పశ్చిమ హిమాలయాల్లో, మధ్య భారతంలో వరదలు సంభవించే అవకాశాలు ఎక్కువని తెలిపారు. గోదావరి, మహానది బేసిన్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని అంచనా వేసినట్లు చెప్పారు. పశ్చిమ తీరం తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోగానీ, అంతకంటే తక్కువగా గానీ ఉంటాయని తెలిపారు. జూన్‌ సగటు ఉష్ణోగ్రతల్లో 1901 (31.7 డిగ్రీల సెల్సియస్‌) తర్వాత మళ్లీ ఈ ఏడాది వాయవ్య భారత్‌లో రికార్డు (38.02 డిగ్రీలు) నమోదైందని చెప్పారు. గరిష్ఠ, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు రెండూ గత నెలలో ఎక్కువగానే ఉన్నాయన్నారు. 

మందకొడిగా నైరుతి 

‘‘ఈసారి తగినన్ని అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడంతో నైరుతి రుతుపవనాలు మందకొడిగా కదులుతూ వచ్చాయి. జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిశాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా 11% లోటు ఆ నెలలో నమోదైంది. 2001 తర్వాత ఇలా జరగడం ఇది ఏడోసారి. కేరళకు రుతుపవనాలు ముందుగానే వచ్చి, మహారాష్ట్ర వరకు బాగానే పురోగమించినా ఆ తర్వాత మాత్రం వేగం తగ్గిపోవడంతో పలు రాష్ట్రాల్లో వేడిమి కొనసాగింది. ఒక్క దక్షిణాదిలో మాత్రమే 14% ఎక్కువగా వానలు పడినా మిగిలిన అన్నిచోట్లా లోటు నెలకొంది. ఎక్కువకాలం పాటు వడగాలులు కొనసాగాయి’’ అని మహాపాత్ర వెల్లడించారు. జూన్‌లో తక్కువ వర్షపాతం ఉన్న 25 ఏడాదులకు గానూ 17 ఏడాదుల్లో ఆ తర్వాత సాధారణ, అంతకుమించిన వర్షపాతం నమోదైంది.


కోస్తాంధ్రకు వర్షసూచన

రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఉత్తరాదిలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. 7 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. కోస్తాంధ్ర, యానాం, మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని