ఎంపీగా ఇంజినీర్‌ రషీద్‌ ప్రమాణానికి ఎన్‌ఐఏ అనుమతి

ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమతి ఇచ్చింది.

Published : 02 Jul 2024 06:19 IST

నేడు తీర్పు వెలువరించనున్న దిల్లీ హైకోర్టు

దిల్లీ: ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమతి ఇచ్చింది. దీనిపై దిల్లీ హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది. అయితే ఈ నెల 5న రషీద్‌ ప్రమాణం చేసే అవకాశముంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఇంజినీర్‌ రషీద్‌ లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో రషీద్‌ అరెస్టయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉండటంతో 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయలేకపోయారు. తన ప్రమాణస్వీకారం కోసం మధ్యంతర బెయిల్‌ కోరుతూ రషీద్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మనీలాండరింగ్‌ కేసులో తిహాడ్‌ జైల్లో ఉన్న సమయంలో ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ పార్లమెంట్‌కు వచ్చి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై జులై ఒకటిలోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌ఐఏను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ తన సమ్మతిని తెలియజేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని