సంక్షిప్త వార్తలు (6)

చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు  వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు.

Updated : 01 Jul 2024 06:10 IST

మీ పిల్లలకు కథలు చెబుతున్నారా?
- ఆలియా భట్, సినీనటి

చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు  వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. అయితే మా అమ్మ నాతో బలవంతంగా పుస్తకాలు చదివించేది. పుస్తక పఠనంతో ఎన్ని ప్రయోజనాలున్నాయో పెద్దయ్యే క్రమంలో తెలుసుకున్నాను. అందుకే నా కుమార్తెకు చిన్నప్పటి నుంచే పుస్తకాలను, కథలను పరిచయం చేస్తున్నాను. ప్రతిరోజూ రాత్రి పడుకొనేముందు తనకు ఓ పిల్లల కథ చదివి వినిపిస్తాను. పిల్లలు కొత్త పదాలు తెలుసుకోవడంతోపాటు వాటిని ఎలా పలకాలో నేర్చుకోవడానికి, వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత పెరగడానికి ఇది దోహదపడుతుంది. అంతేకాదు.. పిల్లల పక్కనే కూర్చొని కథలు చెప్పడం వల్ల తల్లిదండ్రులు-బిడ్డల మధ్య అనుబంధం బలపడుతుంది.


ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్‌’ చేయొద్దు
- ఐక్యరాజ్య సమితి

ఏటా జూన్‌ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్‌ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. ఆన్‌లైన్లో తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా విద్వేషాలు, ఆందోళనలు చెలరేగే ముప్పు ఉంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారాన్ని పంచుకొనేముందు ఈ అయిదు ప్రశ్నలు వేసుకోండి: 1.ఆ సమాచారాన్ని ఎవరు రూపొందించారు? 2.దానికి మూలం ఏంటి?   3.దాన్ని మీతో ఎవరు పంచుకున్నారు?  4.మీరు ఎందుకు ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నారు? 5.అది తాజా సమాచారమేనా? అన్న విషయాలను నిర్ధారించుకొంటే తప్పుడు సమాచారాన్ని నిరోధించొచ్చు. 


50% మించిన రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టం చేయాలి
- జైరాం రమేశ్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

రిజర్వేషన్లను 50 శాతం మించి ఇచ్చేందుకు వీలుగా పార్లమెంటులో చట్టం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై రాష్ట్రాల చట్టాలన్నింటినీ న్యాయరక్షణ కోసం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని విపక్షాలు తొలి నుంచి కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడమూ పరిష్కారం కాదు. అలాంటి చట్టాలూ న్యాయసమీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు 2007లో తీర్పు వెలువరించింది. అందువల్ల రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడమే ఏకైక మార్గం. 50 శాతం గరిష్ఠ పరిమితిని రాజ్యాంగం నిర్దేశించలేదు. సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా     ఆ నిర్ణయం తీసుకున్న విషయం       తెలిసిందే. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టతకు చట్టబద్ధమైన పరిష్కారం అవసరం.


దేశవ్యాప్తంగా భారీవర్షాలు 

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్‌లలో కుండపోత వానతో జనజీవనం స్తంభించింది. గుజరాత్‌లోని సూరత్, భుజ్, వాపీ, భరూచ్, అహ్మదాబాద్‌ నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్‌ జిల్లాలోని పల్సానా తాలూకాలో కేవలం 10 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షం పడింది. దిల్లీలోనూ సోమ, మంగళవారాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని ఐఎండీ అంచనా వేసింది. మహారాష్ట్ర, బిహార్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఆదివారం అధిక వర్షపాతం నమోదైంది. 


నీట్‌ కుంభకోణంలో అరెస్టైన ప్రైవేటు పాఠశాల యజమాని 

గోధ్రా: నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలకు సంబంధించి గుజరాత్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల యజమాని దీక్షిత్‌ పటేల్‌ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. రిమాండ్‌ నిమిత్తం అహ్మదాబాద్‌లోని సీబీఐ కోర్టులో అతడిని హాజరుపరుస్తారు. పంచ్‌మహల్‌ జిల్లాలో గోధ్రా సమీపంలో పటేల్‌ నిర్వహిస్తున్న పాఠశాలను కూడా నీట్‌-యూజీ పరీక్షకు కేంద్రంగా తీసుకున్నారు. ఇక్కడ అక్రమాలు జరిగినట్లు తెలియడంతో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్టయ్యారు.


మథురలో నీళ్లట్యాంకు కూలి ఇద్దరి మృతి
-  11 మందికి తీవ్ర గాయాలు

మథుర: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ నివాస ప్రాంతంలో ఆదివారం వాటర్‌ ట్యాంకు కూలి ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కృష్ణ విహార్‌ కాలనీలో సాయంత్రం ఆరు గంటలకు ఈ ప్రమాదం జరిగింది.  2021లో రూ.6 కోట్ల నిధులతో నిర్మించిన 2.5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఆ ట్యాంకు శిథిలాల కింద చిన్నారులు సహా పలువురు చిక్కుకుపోయారు. కొన్ని గృహాలపైనా శిథిలాలు పడ్డాయి. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా శిథిలాల కింద నుంచి 11 మందిని బయటకు తీశారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు