ప్రభుత్వాన్ని నియంత్రించేది రాజ్యాంగ నైతికతే

రాజ్యాంగ నైతికత ప్రభుత్వాన్ని నియంత్రించే కారకంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందరినీ కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం, సహనాన్ని కొనసాగించడం వంటి షరతులు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు.

Updated : 30 Jun 2024 05:56 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడి

కోల్‌కతా: రాజ్యాంగ నైతికత ప్రభుత్వాన్ని నియంత్రించే కారకంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందరినీ కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం, సహనాన్ని కొనసాగించడం వంటి షరతులు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు. కోల్‌కతాలో నిర్వహించిన నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ ఈస్ట్‌ జోన్‌ ప్రాంతీయ సదస్సులో శనివారం ఆయన కీలకోపన్యాసం చేశారు. సాధారణ నైతికత ప్రజల హక్కుల్ని నియంత్రిస్తే... దానికి భిన్నంగా రాజ్యాంగ నైతికత పాలకుల్ని నియంత్రించే కారకమని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. రాజ్యాంగం ఆకాంక్షించిన సమాజాన్ని సాధించుకునే బాధ్యతను ప్రభుత్వంపై ఇది మోపుతుందన్నారు. భావవ్యక్తీకరణ, స్వేచ్ఛ హక్కులపై ఆంక్షలను నైతికత సహా వివిధ కారణాలతో చట్టం ద్వారా మాత్రమే విధించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని తెలిపారు. న్యాయమూర్తులు తీర్పులను తమ సొంత సైద్ధాంతిక ఆలోచనలతో రాస్తున్నారని చెబుతూ.. వ్యక్తిగత అభిప్రాయాల కంటే రాజ్యాంగ ధర్మం ముఖ్యమని గుర్తించాలని హితవు పలికారు. న్యాయమూర్తులను.. ‘లార్డ్‌షిప్, లేడీషిప్‌’ అని సంబోధించడం వల్ల వారు తమని తాము దేవుళ్లలా భావించే ప్రమాదం ఉందన్నారు. తాము రాజ్యాంగ సేవకులమనే విషయాన్ని మరువరాదని న్యాయమూర్తులకు సూచించారు.

న్యాయవ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలి: మమత 

ఇదే వేదికపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ రాజకీయ పక్షపాతానికి దూరంగా, పూర్తి స్వేచ్ఛతో నిజాయతీగా, స్వచ్ఛంగా పనిచేయాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థల పునాదుల్ని నిలబెట్టడంలో ప్రజాప్రయోజనాల్ని కాపాడటంలో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర అని ఆమె కొనియాడారు. ‘న్యాయవ్యవస్థ ప్రజలకు ఒక ప్రార్థనా మందిరం’ అని ఆమె తెలిపారు. కోర్టుల్ని డిజిటైజేషన్‌ దిశగా నడిపించారంటూ సీజీఐ చంద్రచూడ్‌ని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని