బ్రీత్‌ ఎనలైజర్లపై పకడ్బందీ నిబంధనలు

శ్వాస విశ్లేషణ సాధనాలు (బ్రీత్‌ ఎనలైజర్స్‌) కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను అందించేలా చూడటానికి కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతల విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది.

Published : 30 Jun 2024 05:43 IST

దిల్లీ: శ్వాస విశ్లేషణ సాధనాలు (బ్రీత్‌ ఎనలైజర్స్‌) కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను అందించేలా చూడటానికి కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతల విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది. 2011నాటి లీగల్‌ మెట్రాలజీ (జనరల్‌) నిబంధనల కింద వీటిని వెలువరించారు. ఈ ముసాయిదా నిబంధనలను జులై 26 వరకు తూనికలు, కొలతల విభాగ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారు. ఒక వ్యక్తి రక్తంలో ఎంత మోతాదులో ఆల్కహాల్‌ ఉందో శ్వాస ద్వారా కనిపెట్టే సాధనమే బ్రీత్‌ ఎనలైజర్‌. ఈ సాధనాలు కచ్చితంగా పనిచేస్తున్నట్లు ధ్రువీకరణ ముద్ర పొందిన తరవాతనే వాటిని విక్రయించాలని, వినియోగించాలని కొత్త ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే వినియోగిస్తున్న బ్రీత్‌ ఎనలైజర్ల పనితీరును ఏటా తప్పనిసరిగా తనిఖీ చేయించి ధ్రువీకరించుకోవాలి. కొత్త నిబంధనలు అధికార గెజెట్‌లో ముద్రితమైన నాటి నుంచి అమలులోకి వస్తాయి. లోపభూయిష్ఠ బ్రీత్‌ ఎనలైజర్లు తప్పుడు ఫలితాలను చూపడం వల్ల అనవసర జరిమానాలు విధించాల్సి వస్తోంది. రోడ్డు ప్రమాదాలూ జరుగుతున్నాయి. దీన్ని నివారించడమే ముసాయిదా నిబంధనల లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని