‘డేటింగ్‌ యాప్‌’తో.. ఘరానా మోసం

సివిల్స్‌కి సిద్ధమవుతున్న ఓ యువకుడు ‘డేటింగ్‌ యాప్‌’ల మాయలో పడి రూ.1.2 లక్షలు కోల్పోయిన సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాని వెనకున్న ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 30 Jun 2024 05:37 IST

ముఠా గుట్టును రట్టు చేసిన దిల్లీ పోలీసులు 

దిల్లీ: సివిల్స్‌కి సిద్ధమవుతున్న ఓ యువకుడు ‘డేటింగ్‌ యాప్‌’ల మాయలో పడి రూ.1.2 లక్షలు కోల్పోయిన సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాని వెనకున్న ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. వెర్షా పేరుతో ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువతి పుట్టినరోజు వేడుకల కోసం ఓ యువకుడు గత ఆదివారం ఈస్ట్‌ దిల్లీ వికాస్‌ మార్గ్‌లోని బ్లాక్‌ మిర్రర్‌ కేఫ్‌కు వెళ్లాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక.. స్నాక్స్‌ ఆర్డర్‌ చేశాడు. అవి రాగానే.. అత్యవసరమంటూ యువతి జారుకుంది. రూ.వెయ్యి కూడా కాని ఆ స్నాక్స్‌కు కేఫ్‌ వాళ్లు రూ.1,21,917.70 బిల్లు వేయడంతో.. కట్టేది లేదని అతడు గొడవకు దిగాడు. కట్టకపోతే వదిలే ప్రసక్తే లేదని నిర్వాహకులు అతడిని బంధించారు. తప్పక ఆ మొత్తం కట్టేసిన యువకుడు.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఆమె పేరుతో అతడు..

ఆన్ష్‌ గ్రోవర్, వాన్ష్‌ పాహవా అనే ఇద్దరు మిర్రర్‌ కేఫ్‌ను నడిపిస్తున్నారు. అక్కడి టేబుల్‌ మేనేజర్లలో ఆర్యన్‌ ఒకడు. వీరంతా ఓ ముఠా. ఇందులో అఫ్సాన్‌ పర్వీన్‌ అనే 25 ఏళ్ల యువతి కూడా ఉంది. వెర్షా అనే డమ్మీ పేరుతో డేటింగ్‌ యాప్‌లో ఓ అకౌంట్‌ సృష్టించి.. ఆర్యన్‌ మేనేజ్‌ చేస్తున్నాడు. యాప్‌లో యువకుడితో పరిచయమయ్యాక, జూన్‌ 23న తన పుట్టినరోజని చెప్పి.. బ్లాక్‌ మిర్రర్‌ కేఫ్‌కు రావాలని వెర్షా పేరిట ఆర్యన్‌ వల విసిరాడు. ఆమె ఫొటోలనూ పంపడంతో నిజమేనని నమ్మిన యువకుడు కేఫ్‌కు వెళ్లి మోసపోయాడు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు కేఫ్‌కు వెళ్లగా.. పక్కనే ఉన్న ఓ హోటల్‌లో ముంబయికి చెందిన వ్యక్తితో ఆ యువతి ఉన్నట్లు తెలిసింది. తమదైన శైలిలో ఆమెను విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ఆ వ్యక్తి కూడా మరో డేటింగ్‌ యాప్‌లో పరిచయమైనవాడేనని తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. యువకులను ట్రాప్‌ చేసి కేఫ్, హోటల్‌కు రప్పిస్తారనీ.. ఇష్టానుసారం బిల్లు వేసి అందరూ వాటాలుగా పంచుకుంటారంది. డేటింగ్‌ యాప్‌ విషయం బయటపడుతుందనే భయంతో దాదాపు అందరూ బిల్లు కట్టేసి వెళ్లిపోతుంటారని యువతి పేర్కొంది. దీంతో నిందితులందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని