సంక్షిప్త వార్తలు (5)

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్,  ట్రంప్‌ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్‌ ముందు బైడెన్‌ తేలిపోయారని. అయితే బైడెన్‌ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు.

Updated : 30 Jun 2024 06:07 IST

అమెరికాకు సమర్థులైన అధ్యక్ష అభ్యర్థుల కరవు!

ఇయాన్‌ బ్రెమ్మర్, రాజకీయ విశ్లేషకులు

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్,  ట్రంప్‌ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్‌ ముందు బైడెన్‌ తేలిపోయారని. అయితే బైడెన్‌ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు. ట్రంప్‌తో పోలిస్తే వాస్తవాలనే ఎక్కువగా చెప్పారు. వాదనలు వినిపించడం వరకు చూస్తే ట్రంప్‌ కన్నా బైడెన్‌దే పైచేయి అని చెప్పొచ్చు. కానీ చర్చ సాగినంతసేపు ట్రంప్‌ ఉత్సాహంగా కనిపించగా, బైడెన్‌ తొలి నుంచి కాస్త గందరగోళంగా, అసంబద్ధంగా కనిపించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండటానికి పూర్తిగా అనర్హుడు కాబట్టి అతడు పోటీలో ఉండకూడదు. బైడెన్‌ వయసురీత్యా పోటీ చేయకపోవడమే మంచిది. అమెరికా లాంటి శక్తిమంతమైన దేశానికి గెలుపోటములతో సంబంధం లేకుండా సమర్థులైన అభ్యర్థులు దొరక్కపోవడం బాధాకరం.


రుతుపవనాల సీజన్లో మార్పులపై చర్చ జరగాలి

- ఆనంద్‌ మహీంద్రా, పారిశ్రామికవేత్త 

ఈ ఏడాది కూడా రుతుపవనాల ప్రవేశం అంచనాలకు అందలేదు. జూన్‌లో దేశవ్యాప్త వర్షపాతం లోటు 18 శాతంగా నమోదైంది. దశాబ్దకాలంగా రుతుపవనాల సీజన్‌ రాక, ముగింపునకు సంబంధించి గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవి శాశ్వత మార్పులుగా స్థిరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాటికి అనుగుణంగా రైతులు పొలాల్లో విత్తనం వేసే కాలాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్న విషయంపై విస్తృత చర్చ జరగాలి. మారుతున్న రుతుపవనాల సీజన్‌ను తట్టుకొని మనుగడ సాగించే పంటల వైపు అన్వేషణ జరగాలి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు దీన్ని జాతీయ ప్రాధాన్య అంశంగా పరిగణించి పరిశోధనలు జరపాలి.


సమస్యలను నివారించలేం.. కానీ పరిష్కారం మన చేతుల్లోనే..

- బి.ఎస్‌.గుప్తా, రచయిత,  యోగా శిక్షకులు

జీవితంలో సమస్యలు రాకుండా నివారించడం సాధ్యం కాదు కానీ, వాటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతి మిమ్మల్ని సమస్యల్లో పడేయడం వెనుక ఉద్దేశం మీరు బలహీనంగా ఉన్న అంశాలేంటో మీకు తెలియపర్చి, వాటిలో పట్టు సాధించేలా మిమ్మల్ని సిద్ధం చేయడమే. సమస్యలకన్నా మీరే శక్తిమంతులని గుర్తుంచుకోండి. అవి ఎదురైనప్పుడు కంగారుపడకుండా, పరిష్కార మార్గాల కోసం సావధానంగా ఆలోచించండి. ఆలోచనలతోనే ఆగిపోకుండా ప్రణాళికబద్ధమైన చర్యలకు ఉపక్రమించండి. సమస్య పెద్దది కాకమునుపే పరిష్కారానికి ప్రయత్నించండి. మొక్కను వేర్లతో సహా పెకిలించడం సులువు కానీ, చెట్టును పెకిలించడం కష్టం కదా.


వైవిధ్యమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి

- జెన్సెన్‌ హువాంగ్, ఎన్‌విడియా సీఈవో

మనం కలిసే ప్రతి వ్యక్తి నుంచి మనకు తెలియని విషయం నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలి. అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించొద్దు. కొన్నిసార్లు చిన్నపిల్లల నుంచి నేర్చుకొనే విషయాలు కూడా జీవితంలో గొప్ప ఫలితాలనిస్తాయి. నిరంతరం మన నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవడమే కాదు, విభిన్న వృత్తుల్లో ఉండేవారి కలయికతో వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. వివిధ రంగాల్లో అప్పుడే కెరీర్‌లో ప్రవేశించిన ట్రైనీల నుంచి ఉన్నత స్థానాల్లో ఉండేవారి వరకూ మన సన్నిహిత బృందంలో ఉంటే మన ఆలోచనా పరిధి విస్తృతం అవుతుంది.


రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3కు వాయిదా

ఠాణె: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలకు గాను రాజేశ్‌ కుంతే అనే సంఘ్‌ పరివార్‌ కార్యకర్త ఈ కేసు పెట్టారు. శనివారం జరగాల్సిన విచారణ మేజిస్ట్రేట్‌ సెలవులో ఉండడం వల్ల వాయిదాపడిందని రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాది నారాయణ్‌ అయ్యర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని