మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు

ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్‌ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు.

Published : 29 Jun 2024 05:37 IST

- ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి

దిల్లీ: ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్‌ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. మిగిలిన రంగాలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలకు ఈ నిబంధనను అప్పుడే వర్తింప చేయవద్దని కోరారు. ఈ అంశాన్ని స్వతంత్ర సభ్యుడైన కార్తికేయ శర్మ శుక్రవారం రాజ్యసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో వెలువడే వాణిజ్య ప్రకటనల్లో సత్యనిష్ఠతను, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో ఈ నిబంధనను ఈ నెల 18 నుంచి అమలులోకి తెచ్చారన్నారు. వాణిజ్య ప్రకటన ప్రచురణ లేదా ప్రసారం చేయడానికి ముందే ఆ ప్రకటనకర్త/సంస్థ అందించే స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన ‘బ్రాడ్‌కాస్ట్‌ సేవా పోర్టల్‌’కు సమర్పించాల్సి ఉంటుంది. ఆచరణలో ఇది పలు సాంకేతిక, న్యాయ సంబంధ సమస్యలకు దారి తీస్తోందని కార్తికేయ శర్మ తెలిపారు. చిన్నచిన్న మీడియా సంస్థలు దీనివల్ల తమ ఆదాయ వనరులను కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. స్వీయ ధ్రువీకరణ పత్రాలను నిల్వ చేసి ఉంచడం కూడా సమస్యగా మారుతుందన్నారు. అందువల్ల స్వీయధ్రువీకరణ నిబంధన అమలుపై సంబంధిత భాగస్వాములు అందరితో చర్చించి ఆచరణీయమైన విధివిధానాలను రూపొందించాల్సి ఉందన్నారు. అప్పటివరకు వైద్యపరమైన ఉత్పత్తులకు మాత్రమే ఈ నిబంధనను వర్తింపజేసి మిగిలిన వాటికి మినహాయింపునివ్వాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని