పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్‌సైట్‌ ప్రారంభం

నీట్‌ యూజీ , యూజీసీ నెట్‌ పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Published : 29 Jun 2024 05:37 IST

దిల్లీ: నీట్‌ యూజీ , యూజీసీ నెట్‌ పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణ విభాగం ఎన్‌టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల సూచనలు కోరింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://innovateindia.mygov. in/examinationnreformsnnta/ వెబ్‌సైట్‌ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. జులై 7, 2024 వరకు ఇది అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం జూన్‌ 22న కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వం వహిస్తుండగా.. దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కె.రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్, ఐఐటీ దిల్లీ డీన్‌ ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో పురోగతి, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.   

మూడో రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

నీట్‌-యూజీ, పీజీ; యూజీసీ-నెట్‌లో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ పలు విద్యా సంఘాలు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమం శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఏఐఎస్‌ఏ, దిల్లీ వర్సిటీకి చెందిన క్రాంతికారి యువ సంఘటన్‌ (కేవైఎస్‌) సహా పలు సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. ‘ఎన్‌టీఏకు భారత్‌ వ్యతిరేకం’ అంటూ వారు చేపట్టిన నిరసనలో ఎన్‌టీఏను రద్దు చేయాలని, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. 

నీట్‌పై చర్చకు ఇండియా సిద్ధం: రాహుల్‌

నీట్‌ పరీక్షలో జరిగిన అవినీతిపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంతో శాంతియుతంగా చర్చించడానికి విపక్ష నేతలు సిద్ధంగా ఉన్నారన్నారని ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని