ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు

భారత్‌తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్‌ రీజనింగ్‌ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది.

Published : 29 Jun 2024 05:36 IST

‘ఈఐ’ అధ్యయనంలో వెల్లడి 

దిల్లీ: భారత్‌తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్‌ రీజనింగ్‌ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ‘గణిత ఉపాధ్యాయుల్లో విషయ పరిజ్ఞానం - ప్రాథమిక - మధ్యస్థాయి గణిత భావనలపై అపోహల విశ్లేషణ’ పేరుతో ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ ‘ఈఐ’ ఈ అధ్యయనం చేసింది. ఇందుకోసం మన దేశంతోపాటు యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియాలోని 152 పాఠశాలల్లోని 3, 4, 5, 6 తరగతులకు చెందిన 1,300 మంది గణిత బోధకులను రెండేళ్ల పాటు పరిశీలించింది. ఈ సమయంలో టీచర్‌ ఇంపాక్ట్‌ ప్రోగ్రామ్స్‌ (టిప్స్‌) పేరుతో లెవల్‌-1 గణితంలో విషయ పరిజ్ఞాన మూల్యాంకనం చేపట్టారు. ఈ సందర్భంగా వారి సబ్జెక్ట్‌ పరిజ్ఞానాన్ని కొలవడంతోపాటు దాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పంచుకున్నారు. వారిలో 80 శాతం మంది టీచర్లు భారత్‌కు చెందిన వారు కాగా, 18 శాతం మంది యూఏఈ, ఒక శాతం ఒమన్, సౌదీ అరేబియాకు చెందిన వారు ఉన్నారు. ఈ అధ్యయనం ప్రకారం.. 75 శాతం మంది ఉపాధ్యాయులు 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. 25 శాతం మంది మాత్రమే తప్పుల్లేకుండా జవాబులు చెప్పగలిగారు. నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజగణితం వంటి కాన్సెప్ట్‌లపై 80 శాతం మంది తడబడ్డారు. 73.3 శాతం మంది  గ్రేడ్‌-4 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగారని, 36.7 శాతం మాత్రమే గ్రేడ్‌-7 అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగారని నివేదిక పేర్కొంది. రేఖాగణిత భావనల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉందని తెలిపింది. 36.3 శాతం మంది దశాంశాలను క్రమం చేయడంలో తప్పులు చేశారంది. ‘‘ఈ అధ్యయనం విద్యా వ్యవస్థకు ఒక మేల్కొలుపు వంటిది. ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌ (పీసా) అంచనాలకు సంబంధించి 73 దేశాల్లో భారతదేశం చివరి స్థానంలో ఉంది. పాఠ్య పుస్తకాల్లోని మూస ప్రశ్నల వల్ల విద్యార్థుల అవగాహనలో అంతరం పెరుగుతోంది. విద్యార్థుల నైపుణ్యాలు వారు ఎదుర్కొనే ప్రశ్నలతో ఎక్కువగా ప్రభావితమవుతాయి. కంఠస్థ పద్ధతిలో నేర్చుకునే విద్య క్లిష్టమైన, సృజనాత్మక ఆలోచనలను బలహీనపరుస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో విమర్శనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో కూడిన విద్య అవసరం’’ అని ఈఐ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ లెర్నింగ్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ రాజగోపాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని