సంక్షిప్త వార్తలు (5)

దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం  విభజనవాదంతో నిండిపోయింది.

Updated : 29 Jun 2024 05:53 IST

హేతుబద్ధత లేని చర్చలతో దేశానికి తీవ్ర నష్టం
- అక్షత్‌ శ్రీవాస్తవ, ఆర్థిక వ్యవహారాల నిపుణులు

దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం  విభజనవాదంతో నిండిపోయింది. దీనివల్ల ఎవరూ ఏ రకమైన విమర్శలనూ సహించడం లేదు. కాబట్టే ఎవరికీ జవాబుదారీతనం లేక మనకు మెరుగైన ఫలాలు అందడం లేదు. ఫలితంగా నిజమైన     ప్రతిభకు గుర్తింపు దక్కక నెమ్మదిగా     కనుమరుగవుతోంది. హేతుబద్ధతతో  ఆలోచించడం మొదలుపెట్టకపోతే దేశానికి తీవ్ర నష్టం కలుగుతుంది. దేశాన్ని    అభివృద్ధి చేసే సామర్థ్యమున్నవారు ఇతర దేశాలకు తరలిపోయి తమ మేధస్సును అక్కడ వినియోగిస్తున్నారు.


పార్లమెంటు ప్రజలది.. ప్రభుత్వానిది కాదు
- కపిల్‌ సిబల్, రాజ్యసభ ఎంపీ

ప్రతిపక్ష ఎంపీల గళాన్ని వినడానికి   లోక్‌సభ స్పీకర్‌కు ఇష్టం ఉండకపోవచ్చు. ప్రభుత్వానికి వారి అభిప్రాయాలు అసలు నచ్చకపోవచ్చు. కానీ దేశ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ తరఫున పార్లమెంటులో గళం వినిపించాలని కోరుకుంటారు. పార్లమెంటు ప్రజల కోసమే తప్ప ప్రభుత్వం కోసమో, స్పీకర్‌ ఇష్టాయిష్టాల కోసమో కాదు. కాబట్టి విపక్ష ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ఎంత ముఖ్యమో, వారు చెప్పే అభిప్రాయాలు నచ్చినా, నచ్చకపోయినా మైక్‌ కట్‌ చేయకపోవడం అంతే ముఖ్యం.


21 శాతం క్రీడాకారిణులకు లైంగిక వేధింపులు 
- యునెస్కో

ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలోకి    ప్రవేశిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. క్రీడల్లో మహిళలకు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పిస్తేనే వారు తమ శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించి రాణిస్తారు. 21 శాతం మంది క్రీడాకారిణులు చిన్నతనంలో శిక్షకులు, ఇతరుల నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు చెప్పారు. వీటి గురించి బయటకు చెప్పలేక ఆటలకు దూరమైన వారూ ఉన్నారు. వేధింపులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న వారివల్లే ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులను నివారించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి.


మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక వాస్తవ విరుద్ధం
- భారత విదేశీ వ్యవహారాల శాఖ ఖండన

దిల్లీ: అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంశంపై బుధవారం అమెరికా విడుదల చేసిన వార్షిక నివేదిక-2023పై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటు బ్యాంకు కేంద్రంగా రూపొందించిన సదరు నివేదిక పూర్తి పక్షపాత ధోరణిలో ఉందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంగీకరించబోమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ నివేదికలోని అంశాలను ఖండిస్తున్నామన్నారు.


చండీగఢ్‌లో 24 గంటలూ దుకాణాలు తెరవచ్చు!

చండీగఢ్‌: వ్యాపారాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ పాలనా యంత్రాంగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పొడుగునా 24 గంటలూ దుకాణాల్ని, వ్యాపార సంస్థలను తెరుచుకునే వెసులుబాటును కల్పించింది. పంజాబ్‌ షాప్స్‌ అండ్‌ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం, 1958(చండీగఢ్‌కూ వర్తిస్తుంది) ప్రకారం చండీగఢ్‌లో నమోదైన అన్ని దుకాణాలూ, వ్యాపార సంస్థలకు ఏడాదిలో 365 రోజులూ, రోజులో 24 గంటలూ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్‌ చట్టాలు వర్తించే లిక్కర్‌ దుకాణాలూ, బార్లకు మాత్రం ఈ నియమం వర్తించదని అధికారులు తెలిపారు. మహిళా ఉద్యోగులు మాత్రం రాత్రి ఎనిమిది గంటల తర్వాత పనిచేయకూడదనే నిబంధన తెచ్చారు. ఒకవేళ ఎవరైనా పనిచేయాలనుకుంటే, వారి నుంచి రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాలని, వారి భద్రతకు యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని