కాస్త ఒళ్లు వంచండి బ్రో

భారత్‌లో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావాల్సినంత శ్రమను అందించడం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది.

Updated : 27 Jun 2024 07:09 IST

దేశంలో కనీస వ్యాయామం చేయనివారు సగం మంది
లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: భారత్‌లో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావాల్సినంత శ్రమను అందించడం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులోనూ మహిళలు మరింత వెనకబడి ఉన్నారని తెలిపింది. మహిళల్లో 57 శాతం మంది కనీస శారీరక శ్రమకు దూరంగా ఉండగా.. పురుషుల్లో ఇది 42 శాతంగా ఉంది. దక్షిణాసియాలోని ప్రతి దేశంలో ఇదే పోకడ ఉన్నట్లు ఈ అధ్యయనం అభిప్రాయపడింది. 2022కు సంబంధించిన ఈ అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన వారు సహా పలువురు అంతర్జాతీయ పరిశోధకులు నిర్వహించారు. దీనిని ‘ద లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. దీని ప్రకారం.. చేయాల్సిన స్థాయిలో శారీరక శ్రమ చేయకపోవడంలో అధిక ఆదాయం ఉన్న ఆసియా పసిఫిక్‌ దేశాల తర్వాతి స్థానంలో దక్షిణాసియా దేశాలున్నాయి.

పొంచి ఉన్న మధుమేహం ముప్పు

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 31 శాతం మంది వయోజనులు.. వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ, కఠిన వ్యాయామాలు లేదా 75 నిమిషాల కఠిన-అతి కఠిన వ్యాయామాలైనా చేయడం లేదు. 2010లో ఇలా సరిపడినంత వ్యాయామం చేయనివారు 26.4 శాతం ఉండగా ఇప్పుడు అది 31 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పోకడ కొనసాగితే అవసరమైన శారీరక శ్రమను చేసేవారి సంఖ్యను 15 శాతం పెంచాలనుకునే లక్ష్యాన్ని ఇప్పుడప్పుడే చేరుకోలేమని అధ్యయనకర్తలు అభిప్రాయడ్డారు. అదే విధంగా 2030 నాటికి కనీస శారీరక శ్రమ చేయని వారి సంఖ్య 60 శాతానికి చేరిపోతుందని తెలిపారు. మరోవైపు ఇలా వ్యాయామం చేయని వారిలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగడం సమస్యలను మరింత జటిలం చేస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం మధుమేహం, గుండెపోటు వంటి ముప్పులను మరింత పెంచుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ప్రస్తుతం వ్యాయామం చేసే వారు తగ్గిపోవడంతో ఈ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని.. ఇది ప్రభుత్వాల బడ్జెట్‌పై మోయలేని భారం వేస్తోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని