హిజాబ్‌ నిషేధంపై జోక్యం చేసుకోలేం: బాంబే హైకోర్టు

హిజాబ్, బుర్ఖా, నఖాబ్‌లపై నిషేధం విధిస్తూ ముంబయిలోని ఓ కళాశాల తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు బుధవారం తెలిపింది.

Published : 27 Jun 2024 05:42 IST

ముంబయి: హిజాబ్, బుర్ఖా, నఖాబ్‌లపై నిషేధం విధిస్తూ ముంబయిలోని ఓ కళాశాల తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు బుధవారం తెలిపింది. ఈ అంశం విద్యార్థుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, విద్యార్థులకు యూనిఫాం నిర్ణయించడం కళాశాల ప్రాథమిక హక్కని స్పష్టంచేసింది. ముంబయి కళాశాలలో డిగ్రీ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థినులు హిజాబ్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు ఏఎస్‌ చందూర్కర్, రాజేశ్‌ పాటిల్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ హిజాబ్‌ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని.. వారి పిటిషన్‌ను కొట్టివేసింది. కళాశాల ఆవరణలో హిజాబ్, నఖాబ్, బుర్ఖా, స్టోల్స్, టోపీలు, బ్యాడ్జీలు ధరించరాదని యజమాన్యం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సదరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అల్తాఫ్‌ ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఇస్లాంలో హిజాబ్‌ ధరించడం అత్యంత ముఖ్యమైన అంశమని, ఇది వారి మత స్వేచ్ఛ కిందకు వస్తుందని పేర్కొన్నారు. కళాశాల యజమాన్యం తరఫు న్యాయవాది అనిల్‌ అంతూర్కర్‌ వాదనలు వినిపిస్తూ.. అన్ని మతాలకు చెందిన విద్యార్థులకు ఒకే విధమైన డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు తీర్పునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని