ముంబయి రైళ్లలో పశువుల తరలింపులా ప్రయాణాలు సిగ్గుచేటు : హైకోర్టు

లోకల్‌ రైళ్లలో ముంబయి ప్రయాణికులు పశువులను తరలిస్తున్నట్టుగా చేస్తున్న బలవంతపు ప్రయాణాలు చూసి సిగ్గు పడుతున్నట్లు బాంబే హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.

Updated : 27 Jun 2024 07:43 IST

జీఎంలను అఫిడవిట్లు దాఖలు చేయమన్న ధర్మాసనం

ముంబయి: లోకల్‌ రైళ్లలో ముంబయి ప్రయాణికులు పశువులను తరలిస్తున్నట్టుగా చేస్తున్న బలవంతపు ప్రయాణాలు చూసి సిగ్గు పడుతున్నట్లు బాంబే హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అధిక రద్దీతో కూడిన బోగీల నుంచి కిందపడి రైల్వే ప్రయాణికులు మరణిస్తున్న ఉదంతాలు పెరుగుతున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వాదనలు విన్న ధర్మాసనం ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా పేర్కొంది. చీఫ్‌ జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ, జస్టిస్‌ అమిత్‌ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం.. ముంబయిలో దారుణంగా ఉన్న ఈ పరిస్థితులకు కేంద్ర, పశ్చిమ రైల్వే విభాగాల ఉన్నతాధికారులను బాధ్యులుగా చేస్తున్నట్లు తెలిపింది. యతిన్‌ జాధవ్‌ అనే వ్యక్తి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ‘‘పిటిషన్‌దారు చాలా తీవ్రమైన విషయాన్ని కోర్టు ముందుకు తెచ్చారు. మీరు (రైల్వే అధికారులు) జవాబు చెప్పాల్సిందే. మేం ఇలా చేయలేదు.. అలా చేయలేదు అని మీరు చెప్పలేరు. రైల్వే ప్రయాణికులను పశువుల్లా తరలిస్తున్న తీరును చేసి మేం సిగ్గుపడుతున్నాం’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని తక్షణం సమగ్రంగా పరిశీలించి, జవాబుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, పశ్చిమ రైల్వే విభాగాల జనరల్‌ మేనేజర్లను (జీఎంలను) న్యాయమూర్తులు ఆదేశించారు. అఫిడవిట్లను జీఎంలు వ్యక్తిగతంగా పరిశీలించాలని, అలాగే ప్రమాదాల నివారణకు అందుబాటులో ఉన్న చర్యలను అందులో సూచించాలని కోర్టు స్పష్టం చేసింది. ఎనిమిది వారాల తర్వాత ఈ కేసును మళ్లీ విచారిస్తామని తెలిపింది. పిటిషనరు కోర్టుకు సమర్పించిన వివరాల మేరకు.. గతేడాది ముంబయి రైల్వే ట్రాక్‌లపై జరిగిన ప్రమాదాల్లో 2,590 మంది (రోజుకు ఏడుగురు చొప్పున) చనిపోగా, 2,441 మంది క్షతగాత్రులుగా మారారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని