ఆయుధాలతో ఇద్దరి సంచారం.. పఠాన్‌కోట్‌లో హైఅలర్ట్‌

భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌కోట్‌లో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

Published : 27 Jun 2024 05:39 IST

చండీగఢ్‌: భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌కోట్‌లో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అమృత్‌సర్‌ సరిహద్దు రేంజి డీఐజీ రాకేశ్‌ కౌశల్‌ బుధవారం మాట్లాడుతూ.. పఠాన్‌కోట్‌ సమీపంలోని కోట్‌ భట్టియాన్‌ గ్రామానికి చెందిన ఒకరు.. తాను ఇద్దరు వ్యక్తులను చూశాననీ, వారి వద్ద ఆయుధాలు సైతం ఉన్నాయని మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించాడన్నారు. ఆ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కఠువా జిల్లాతో సరిహద్దులు పంచుకుంటోంది. ఈ అనుమానితులే కఠువాలోని కోట్‌ పన్నూలో కూడా ఇటీవల తిరిగినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న పాక్‌ నుంచి కథువా జిల్లా సుక్‌పాల్‌ గ్రామంలోకి చొరబడిన ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరి కోసం స్థానిక పోలీసులు, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది కలిసి బామియల్‌ పరిసరాలతోపాటు పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను జల్లెడ పడుతున్నారు. 2016లో పఠాన్‌కోట్‌లోని భారత ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని