సంక్షిప్త వార్తలు (7)

మనం ఇప్పుడు కష్టాలు అనుకున్నవే భవిష్యత్తులో మనకు దక్కిన అదృష్టంగా అనిపిస్తాయి. ఆ కష్టాలను మనం ఎదుర్కోకపోయింటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదనిపిస్తుంది.

Updated : 27 Jun 2024 06:27 IST

కష్టాలు మన పాలిట అదృష్టాలు
- ఎ.వేలుమణి, థైరోకేర్‌ సంస్థ వ్యవస్థాపకులు

మనం ఇప్పుడు కష్టాలు అనుకున్నవే భవిష్యత్తులో మనకు దక్కిన అదృష్టంగా అనిపిస్తాయి. ఆ కష్టాలను మనం ఎదుర్కోకపోయింటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదనిపిస్తుంది. పేదరికంలో పుట్టడం వల్ల చిన్నప్పుడు నాకు సైకిలు కూడా ఉండేది కాదు. ఇంటి నుంచి బడికి వెళ్లి రావడానికి రోజూ 6 కి.మీ. నడిచేవాణ్ని. నాకు పదేళ్ల వయసు నుంచి 25 ఏళ్లు వచ్చేవరకూ ఇదే కొనసాగింది. అంటే దాదాపు 25 వేల   కి.మీ. నడిచాను. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చేటప్పడు శ్రమ తెలియకుండా ఉండేందుకు టీచర్లు చెప్పిన పాఠాలను నెమరువేసుకుంటూ, ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తూ ఉండేవాణ్ని. దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు చురుగ్గా ఆలోచించడం అలవాటైంది. అదృష్టవశాత్తు నన్ను కారు లేదా బైకులో దింపేవాళ్లు కానీ, స్కూల్‌ బస్సు సౌకర్యం కానీ లేకపోవడం వల్లే అది సాధ్యమైందని ఇప్పుడనిపిస్తోంది.


మత్తుపదార్థాలతో ఏటా 30 లక్షల మరణాలు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ

మద్యం, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో మత్తు పదార్థాల ప్రభావం కారణంగా వచ్చే మానసిక వ్యాధులకు సరైన చికిత్స అందకపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోంది. మాదకద్రవ్యాల బానిసలను బాధితులుగా చూడకుండా సమాజం వారిపై వివక్ష చూపడం, మానసిక సమస్యలకు చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం, వాటికయ్యే వ్యయం అధికంగా ఉండటం తదితర కారణాలు మృతుల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. మత్తుపదార్థాల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, సమాజంలో హింస, అశాంతి పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వాలు ఈ సమస్యను రూపుమాపడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలి.


ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదు
- కౌశిక్‌ బసు, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు

ద్రవ్యోల్బణం లాంటి అంశాలను స్థూలంగా చూడటం వల్ల భారతీయ ఆర్థిక విధానం మధ్యతరగతి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉంది. కానీ కూరగాయల ధరల్లో 27.8 శాతం పెరుగుదల నమోదైంది. సంపన్నులు తమ ఆదాయంతో పోలిస్తే కూరగాయలపై వెచ్చించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సామాన్యులు తమ వాస్తవ ఆదాయంలో చాలా మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది వారికి పెనుభారంగా మారింది.


ఉక్రెయిన్‌ యుద్ధంతో లాభపడిన ఏకైక దేశం చైనా
- ఆదిత్య విక్రమ్, రాజకీయ విశ్లేషకులు

ఉక్రెయిన్‌ యుద్ధంతో లాభపడింది చైనా మాత్రమే. ఈ యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలన్నింటికీ ప్రత్యర్థిగా మారిన రష్యా ఒంటరై గత్యంతరం లేని పరిస్థితిలో చైనాకు మరింత దగ్గరైంది. ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన అమెరికా, దాని మిత్ర దేశాల సైనిక, ఆర్థిక వనరులను బలహీనపరిచేందుకే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రష్యాకు సాయం చేశారు. అదే సమయంలో పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ పుతిన్‌ నేతృత్వంలో బలహీనపడిన రష్యాను తన దారిలోకి తెచ్చుకొనేందుకు ప్రణాళిక వేశారు. మరోవైపు భారత్‌ మాత్రం అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా రష్యాతో తన సంబంధాలను కొనసాగించింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది.


జులై 2న విచారణకు హాజరుకండి
- పరువు నష్టం కేసులో రాహుల్‌కు యూపీ కోర్టు ఆదేశం

సుల్తాన్‌పుర్‌: 2018నాటి పరువునష్టం కేసులో జులై 2న తమ ముందు విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాహుల్‌పై భాజపా నేత విజయ్‌ మిశ్ర పరువునష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే.


భారతీయ రాకెట్‌ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం

దిల్లీ: ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్‌ఎస్‌ఐఎల్‌ తన కొత్త రాకెట్‌ ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి.ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. స్పేస్‌ మెషీన్స్‌ కంపెనీ తయారుచేసిన ఆప్టిమస్‌ ఉపగ్రహాన్ని ఎన్‌ఎస్‌ఐఎల్‌.. కక్ష్యలోకి ప్రయోగిస్తుందని రెండు కంపెనీలు దిల్లీలో ప్రకటించాయి. 450 కిలోల బరువైన ఆప్టిమస్‌.. ఆస్ట్రేలియా తయారుచేసిన అతి భారీ ఉపగ్రహం. 10 కిలోల బరువైన జానస్‌ ఉపగ్రహాన్ని ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి. ఇంతకుముందు ప్రయోగించిందని ఎన్‌ఎస్‌ఐఎల్‌ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ దురైరాజ్‌ తెలిపారు.


ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణంపై ప్రతిష్టంభన
- ఆ కార్యక్రమ నిర్వహణకు గవర్నర్‌ విముఖత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఇటీవలి ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణంపై ప్రతిష్టంభన నెలకొంది. రాజ్‌భవన్‌ తొలుత పంపిన సమాచారం ప్రకారం సయంతిక బందోపాధ్యాయ్, రయత్‌ హుస్సేన్‌ సర్కార్‌ బుధవారం నూతన ఎమ్మెల్యేలుగా గవర్నర్‌ నివాసంలో ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే, సాయంత్రం 4 గంటల వరకు గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ రాలేదు. రాజ్‌భవన్‌ వర్గాల సమాచారం ప్రకారం గవర్నర్‌ సాయంత్రం దిల్లీ వెళ్లినట్లు తెలిసింది. ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శోభన్‌దేబ్‌ ఛటోపాధ్యాయ్‌తో నూతన ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురువారం కూడా గవర్నర్‌ కోసం వేచి చూస్తామని తెలిపారు. తాము నామినేటెడ్‌ సభ్యులం కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని తెలిపారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే కార్యక్రమాన్ని స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్‌కు గవర్నర్‌ అప్పగిస్తే సరిపోయేదని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, గవర్నర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నారని విమర్శించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని