బెయిలు దరఖాస్తులు త్వరగా తేల్చాలి

బెయిలు దరఖాస్తులకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశించి పేర్కొంది.

Published : 26 Jun 2024 06:13 IST

పిటిషన్ల వాయిదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: బెయిలు దరఖాస్తులకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశించి పేర్కొంది. మనీలాండరింగు కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ బెయిలు విజ్ఞప్తిపై తదుపరి విచారణ నాటికి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిలుపై హైకోర్టు స్టే విధించడం అసాధారణ చర్యగా పరిగణించిన సుప్రీంకోర్టు మరో కేసులోనూ దిల్లీ ఉన్నత న్యాయస్థానం తీరుపై ఇలా వ్యాఖ్యానించింది. తన బెయిల్‌ పిటిషన్‌ను విచారించకుండా దిల్లీ హైకోర్టు సుదీర్ఘకాలం వాయిదా వేయడంపై మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ మనోజ్‌మిశ్ర, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం.. బెయిలు వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయకూడదని, తదుపరి విచారణ తేదీ అయిన జులై 9న హైకోర్టు తగిన నిర్ణయం తీసుకొంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి సమస్యే మరొకటి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణలో ఉందనీ, జైన్‌ బెయిలు దరఖాస్తును కూడా దానితో కలిపి విచారించాలని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోరారు. త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్న కేసును ద్విసభ్య ధర్మాసనం చేపట్టకూడదని జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర తెలిపారు. దిల్లీ హైకోర్టు బెయిలు దరఖాస్తుపై నిర్ణయం వెలువరించాక తాము ఆ అంశాన్ని చేపడతామని చెప్పారు. జైన్‌ బెయిలు దరఖాస్తు వీగిపోయేలా చేయడానికే ఈడీ అసంపూర్ణ ఛార్జిషీటును సమర్పించిందని సింఘ్వి సుప్రీం దృష్టికి తెచ్చారు. జైన్‌ నాలుగు కంపెనీల ద్వారా అక్రమ ధనం చెలామణి చేశారని 2017లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. అదే ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా 2022లో జైన్‌ను అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తును సకాలంలో పూర్తి చేయలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని