జులైలో రష్యా పర్యటనకు మోదీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బహుశా జులై 8న ఇది ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

Updated : 26 Jun 2024 06:30 IST

సన్నాహాలు ప్రారంభించామన్న క్రెమ్లిన్‌ వర్గాలు

దిల్లీ, మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బహుశా జులై 8న ఇది ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పలు అంశాలపై ప్రధాని విస్తృతస్థాయి చర్చలు జరిపే అవకాశముంది. మాస్కో సందర్శన కార్యరూపం దాల్చితే గత అయిదేళ్లలో ఇది ప్రధాని మోదీకి తొలి రష్యా పర్యటన అవుతుంది. ఇంతకు మునుపు 2019లో రష్యాలోని వ్లాడవాస్టాక్‌ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ పర్యటనకు సంబంధించి భారత్‌ వైపు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇద్దరు అగ్రనేతల భేటీకి క్రియాశీలక సన్నాహాలను తాము అపుడే ప్రారంభించినట్లు మాస్కోలోని క్రెమ్లిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. ‘‘భారత ప్రధాని రాకకు మేము సిద్ధమవుతున్నట్లు నేను నిర్ధరించగలను. అయితే, పర్యటన తేదీని అపుడే చెప్పలేము. ఈ విషయం ఉభయులూ తర్వాత ప్రకటిస్తారు’’ అని రష్యా అధ్యక్షుడి సహాయకుడైన యూరి ఉషకోఫ్‌ మీడియాకు వివరించారు. జులై 3, 4 తేదీల్లో కజఖ్‌స్థాన్‌లో జరగనున్న షాంఘై సదస్సు (ఎస్‌సీవో)కు గైర్హాజరు కావాలని మోదీ నిర్ణయించుకొన్న నేపథ్యంలో క్రెమ్లిన్‌ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. అలాగే అక్టోబరు నెలలో బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) వార్షిక సదస్సుకు రష్యా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతారని రష్యాకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు క్రెమ్లిన్‌ అధికారులు తెలిపారు.

ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇప్పటిదాకా రష్యా, భారత్‌ల నడుమ 21 సార్లు వార్షిక భేటీలు జరిగాయి. చివరిసారిగా 2021 డిసెంబరు 6న దిల్లీ వేదికగా పుతిన్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఖరారైతే మూడేళ్ల విరామం అనంతరం ఇరు దేశాల మధ్య 22వ వార్షిక సమావేశం జరుగుతుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే విషయాన్ని కూడా పుతిన్‌తో మోదీ చర్చించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం వెంటనే ముగిసిపోవాలని భారత్‌ ఆది నుంచీ  కోరుకుంటున్నా, మాస్కోతో ద్వైపాక్షిక స్నేహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోడానికి సిద్ధంగా లేనందునే ఉక్రెయిన్‌పై దాడిని ఇప్పటిదాకా ఖండించలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెబుతూ వస్తోంది.

కజఖ్‌ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ

కజఖ్‌స్థాన్‌ అధ్యక్షుడు కాసం జోమార్ట్‌ తొకయేవ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. జులై 3-4 తేదీల్లో కజఖ్‌లో జరగబోయే ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని, దానికి భారత్‌ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై తనను అభినందించినందుకు ధన్యవాదాలు చెప్పారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మున్ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. సదస్సుకు మోదీ వెళ్లడం లేదని, ఆయన బదులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ హాజరవుతారని దౌత్యవర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు