ఖతార్‌ జైల్లో మగ్గుతున్న నౌకాదళ మాజీ అధికారుల విడుదల

దౌత్యపరంగా భారత్‌ పెద్ద విజయం సాధించింది. గూఢచర్య ఆరోపణలపై ఖతార్‌ జైలులో 2022 నుంచి మగ్గుతున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.

Published : 13 Feb 2024 04:40 IST

భారత్‌కు అతి పెద్ద దౌత్య విజయం
గూఢచర్యం ఆరోపణలతో వీరంతా అరెస్టు

దిల్లీ: దౌత్యపరంగా భారత్‌ పెద్ద విజయం సాధించింది. గూఢచర్య ఆరోపణలపై ఖతార్‌ జైలులో 2022 నుంచి మగ్గుతున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏడుగురు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ఎనిమిదో వ్యక్తిని కూడా సాధ్యమైనంత త్వరగా భారత్‌ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పేర్కొన్నారు. 18 నెలలుగా అక్కడి జైల్లో ఉన్న వీరికి స్థానిక న్యాయస్థానం మరణ దండన విధించింది. తర్వాత జైలు శిక్షగా మార్చింది. ఇప్పుడు అభియోగాల నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించింది. ఖతార్‌ నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది. ‘‘ఖతార్‌లోని దహ్రా గ్లోబల్‌ కంపెనీలో పనిచేస్తూ అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరుల విడుదలకు వీలుగా ‘ఎమిర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌’ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం’’ అని విదేశీవ్యవహారాల శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. విడుదలలో ప్రధాని మోదీతో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పలుమార్లు ఆయన రహస్యంగా దోహా పర్యటించారు. 2022లో గూఢచర్యం ఆరోపణలతో ఈ మాజీ నౌకాదళ సిబ్బందిని ఖతార్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. సుగుణాకర్‌ విశాఖ వాసి. ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని దిల్లీకి చేరుకున్న నౌకాదళ మాజీ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున విమానాశ్రయానికి చేరుకున్న వీరు ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలు చేశారు.

ఖతార్‌కు ఈ నెల 14న మోదీ 

గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన నావికాదళ మాజీ అధికారులను ఖతార్‌ ప్రభుత్వం విడుదల చేసిన వేళ.. భారత విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 14న ఖతార్‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారని పేర్కొంది. 13,14 తేదీల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పర్యటించనున్న ప్రధాని.. అక్కడినుంచి దోహాకు వెళ్తారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా సోమవారం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని