నవశకపు నిర్మాణ అద్భుతం!

అటు ఆధ్యాత్మికంగా.. ఇటు నిర్మాణకౌశలం పరంగా అది భారత్‌లో ఓ కొత్త గమ్యస్థానం. అయోధ్యలో రూపుదిద్దుకున్న శ్రీరాముడి భవ్య ఆలయం.. నవశకపు నిర్మాణ అద్భుతం.

Updated : 23 Jan 2024 07:33 IST

రామ మందిరంలో అణువణువునా ఆధ్యాత్మికత, కళాత్మకత
వెయ్యేళ్లయినా చెక్కుచెదరని రీతిలో నిర్మాణం

అటు ఆధ్యాత్మికంగా.. ఇటు నిర్మాణకౌశలం పరంగా అది భారత్‌లో ఓ కొత్త గమ్యస్థానం. అయోధ్యలో రూపుదిద్దుకున్న శ్రీరాముడి భవ్య ఆలయం.. నవశకపు నిర్మాణ అద్భుతం. రామభక్తుల వందల ఏళ్ల కలల కోవెలను వెయ్యేళ్లయినా చెక్కుచెదరని రీతిలో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించారు. నాగరశైలిలో శిల్పులు ఎంతో నైపుణ్యంతో నగిషీలద్దిన ఈ ఆలయం అజరామరంగా నిలిచిపోనుంది. ఈ సువిశాల ప్రాంగణాన్ని అనేక ఇంజినీరింగ్‌ సవాళ్లను అధిగమించి, ప్రకృతికి చేటు కలగనిరీతిలో నిర్మించారు. దేశంలోని అత్యుత్తమ నిపుణుల మేధోమథన ఫలితం ఈ ఆలయమని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.


ఇదీ ఆలయ ప్రత్యేకత..

లయ పునాదుల కోసం తవ్వకాలు చేపట్టినప్పుడు.. పునాది రాయి వేయడానికి ఇక్కడి నేల అనువుగా లేదని తేలింది. దీంతో కృత్రిమ పునాదిని సృష్టించాలని ఇంజినీర్లు నిర్ణయించారు. దీన్ని 14 మీటర్ల మందంతో రోలర్‌ కాంపాక్ట్‌ కాంక్రీటు-ఆర్‌సీసీతో నిర్మించారు. ఇది కృత్రిమ శిలలా తయారైంది. దీనిపైన బాహ్యనిర్మాణాన్ని సిద్ధం చేశారు.

  • ప్రధాన ద్వారం వద్ద ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, గరుడ శిల్పాలు కనిపిస్తాయి. వీటిని ఇసుకరాయితో రూపొందించారు.
  • ఆలయంలోని శిలలపై ఆంజనేయుడు, ఇతర దేవతలు, నెమళ్లు, పూల ఆకృతులను అందంగా చెక్కారు. ఇవన్నీ భక్తిభావాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.
  • ఆలయంలో నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం ఉన్నాయి. రామ మందిరానికి సమీపంలో పురాతనమైన సీతా కూప అనే బావి కూడా ఉంది.
  • ఆలయ సముదాయ నైరుతి భాగంలోని కుబేర్‌ తిల వద్ద జటాయువు విగ్రహంతోపాటు పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు.
  • ఆలయ ప్రాంగణానికి నాలుగు మూలల్లో నాలుగు మందిరాలు ఉన్నాయి. వీటిని సూర్యదేవుడికి, దేవీ భగవతికి, గణపతికి, శివుడికి అంకితమిచ్చారు. ప్రాంగణ ఉత్తర భాగంలో మాతా అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపున హనుమంతుడి మందిరం ఉన్నాయి.
  • ఆలయ ప్రాంగణంలో నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం నీటి సరఫరా, రెండు మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ ఉన్నాయి. మంటలు ఆర్పడానికి నేలమాళిగలోని ఒక రిజర్వాయర్‌లో నీరు నిల్వ ఉంటుంది.
  • ఆలయ ప్రాంగణంలోని సింహ భాగం పచ్చదనాన్ని సంతరించుకొని ఉంటుంది. 70 ఎకరాల ప్రాంగణంలోని 70 శాతం మేర చెట్లే ఉంటాయి. 
  • ప్రధాన ఆలయానికి చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో పెర్కోటా అనే నిర్మాణం ఉంటుంది. దీని పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులు. ఇది ఒకరకంగా ఆలయానికి ప్రహరీలాంటిది. ఇలాంటి ఆకృతులు దక్షిణ భారత దేశ ఆలయాల్లో కనిపిస్తుంటాయి.

ఏమిటీ నాగరశైలి?

సాధారణంగా శిల్ప శాస్త్రంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు పద్ధతులు ఉంటాయి. అవి.. నాగర, ద్రవిడ, విసార. ఇందులో నాగరశైలి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. ద్రవిడ శైలిలో దక్షిణాది ఆలయాలను నిర్మిస్తుంటారు. నాగరశైలిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడటమే కాకుండా హిందూ ధర్మానికి దర్పణం పడుతుంది. అందులో అటు కళాత్మకత, ఇటు ఆధ్యాత్మికత ప్రతిబింబిస్తుంది. 5వ శతాబ్దం నుంచి ఈ శైలిలో ఆలయ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉత్తర భారతదేశంతోపాటు కర్ణాటకలోనూ ఈ తరహా కట్టడాలు కనిపిస్తాయి. ఏళ్లు గడిచేకొద్దీ నాగర శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. గుప్తుల హయాంలో దీనికి మంచి ఆదరణ లభించింది.

  • నాగరశైలి ఆలయాల్లో గర్భగుడి, మండపం, ప్రదక్షిణ పాద, శిఖర, అమలక, కలశ, అంతరాల, జగతి అనే భాగాలు ఉంటాయి.
  • గర్భగుడిని జన్మస్థానంగా పరిగణిస్తారు. అందుకే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నాగరశైలిలో ‘జగతి’పైన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు. గర్భగుడికి ఎదురుగా మండపాన్ని నిర్మిస్తారు. గర్భగుడికిపైన ఉండే గోపురాన్ని శిఖరంగా వ్యవహరిస్తారు. మేరు పర్వత ఆకృతిలో దీన్ని నిర్మిస్తారు. నాగరశైలి ఆలయాలకు భారీ ప్రహరీ గోడలు, పుష్కరణి ఉండదు. దానికి బదులుగా ప్రదక్షిణ పథం ఉంటుంది. శిఖరానికి పైన ఉండే నిర్మాణాన్ని అమలక అంటారు. ఆ శిఖరంపైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు.
  • నాగరశైలిలో నిర్మించే ఆలయాల్లో ఇనుము వాడరు. ఇనుముతో కడితే తుప్పుపట్టి, ఆకృతి త్వరగా దెబ్బతింటుంది. దీర్ఘకాలం మన్నేలా పూర్తిగా శిలలతో నిర్మిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు