Emergency: పాఠ్యాంశంగా ఎమర్జెన్సీ కాలం

ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చిన అత్యయిక పరిస్థితుల (ఎమర్జెన్సీ) నాటి రోజుల గురించి నేటి తరానికి తెలియజేయడానికి దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు.

Updated : 26 Jun 2024 06:33 IST

వెంకయ్యనాయుడి సూచన

ఈనాడు, దిల్లీ: ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చిన అత్యయిక పరిస్థితుల (ఎమర్జెన్సీ) నాటి రోజుల గురించి నేటి తరానికి తెలియజేయడానికి దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ‘వికసిత భారతంలో ప్రజాస్వామ్య విలువల రక్షణ- యువత పాత్ర’ అనే అంశంపై మంగళవారం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘అత్యయిక పరిస్థితి అంటే ఏంటి? దాన్ని ఎలా అమలు చేశారు? ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమిటి? జయప్రకాశ్‌ నారాయణ్‌ నిర్వహించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం లక్ష్యమేంటి? అనే వివరాలన్నింటినీ పిల్లలు తెలుసుకునేలా చేయాలి. ఎమర్జెన్సీ సమయంలో లక్షలమందిని ఎలా జైలు పాల్జేశారు? ఎన్ని చిత్రహింసలు పెట్టారు? పత్రికలను ఎలా సెన్సార్‌ చేశారు? ప్రజల స్వేచ్ఛకు ఎంత భంగం కలిగించారన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉంది’’ అని ఆయన చెప్పారు.

వెంకయ్యనాయుడి నివాసానికి మోదీ 

వెంకయ్యనాయుడి అధికార నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లి సుమారు 45 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘‘వెంకయ్యనాయుడితో దశాబ్దాలపాటు కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. దేశాభివృద్ధిపై ఆయనకున్న తపన, వివేకం అంటే నాకెంతో ఇష్టం. మా మూడోవిడత పాలన విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా మోదీ తెలిపారు. ‘‘దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. మోదీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాలలో భారత్‌ మరింత ప్రకాశిస్తుందని, సరికొత్త శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని