Mumbai Rains: కుప్పకూలిన భారీ హోర్డింగ్‌.. ఎనిమిది మంది మృతి

ముంబయిలో బలమైన ఈదురు గాలుల దాటికి ఘాట్కోపర్‌ ప్రాంతంలో భారీ హోర్డింగు కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది.

Updated : 13 May 2024 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయిలో పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్‌ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగు కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. 

సోమవారం సాయంత్రం దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్కోపర్‌, ములుంద్‌, విఖ్రోలితోపాటు దక్షిణ ముంబయిలో అనేక ప్రాంతాల్లో వర్షంతోపాటు, బలమైన గాలులు వీచాయి. చెడ్డా నగర్‌ జింఖానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. సుమారు 100 మందికిపైగా దాని కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి పలువురిని రక్షించాయి.  

‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్‌

క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈదురుగాలుల నేపథ్యంలో నగరంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లపై  సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో మెట్రో, లోకల్‌ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబయి ఎయిర్‌పోర్టులో సాయంత్రం గంటపాటు విమాన సర్వీసులనూ నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని