New Criminal Code: అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. 

Published : 01 Jul 2024 10:24 IST

First Case Under New Criminal Code| దిల్లీ: భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)(Bharatiya Nyay Sanhita), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదైంది. న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌ (NDRS) పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

దేశ రాజధానిలో ఒక వీధి వ్యాపారి రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించారు. అతడి తాత్కాలిక దుకాణం ఎన్‌డీఆర్‌ఎస్‌ సమీపంలోని ఫుట్‌ ఓవర్ బ్రిడ్జ్‌ కింద ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దాంతో దానిని వేరేచోటుకు తరలించమని అతడికి పోలీసులు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ వీధి వ్యాపారిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

New Criminal Laws: న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం

ఈ కొత్త చట్టాల ప్రకారం.. క్రిమినల్‌ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం.. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఇంతకుముందు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు