Tragedy: జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం

మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు.

Updated : 01 Jul 2024 06:13 IST

మరో ఇద్దరు చిన్నారుల గల్లంతు
లోనావాలాలోని భూసీ డ్యామ్‌ సమీపంలో ఘటన

పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. నాలుగేళ్ల నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసున్న ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుటుంబమంతా విహారయాత్ర సంబరంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం గాలింపు చర్యలు చేపట్టినట్లు పుణె గ్రామీణ ఎస్పీ పంకజ్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ‘‘మేం 36 ఏళ్ల మహిళ, 13 ఏళ్లు, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికల మృతదేహాలను గుర్తించాం. 9 ఏళ్ల బాలిక, నాలుగేళ్ల బాలుడి కోసం గాలిస్తున్నాం. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని, భూసీ డ్యామ్‌కు 2 కిలోమీటర్ల దూరంలోని జలపాతంలో కాలు జారి పడిపోయి జలాశయం దిగువ ప్రాంతంలో మునిగిపోయారు’’ అని వివరించారు. ‘‘హడప్సర్‌ ప్రాంతానికి చెందిన అన్సారీ కుటుంబం విహారయాత్ర కోసం భూసీ డ్యామ్‌కు వచ్చింది. అనంతరం జలపాతంలోకి వెళ్లారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ప్రవాహం పెరిగిన సంగతి గమనించలేదు. అనంతరం ప్రవాహం ఉద్ధృతికి కొట్టుకుపోయారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశాం. సోమవారం ఉదయం తిరిగి ప్రారంభిస్తాం’’ అని లోనావాలా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని