Arvind Kejriwal: సిసోదియా పేరు నేను చెప్పలేదు.. కోర్టులో వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోదియాను ఇరికించేందుకు తాను ప్రయత్నించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ఈ మేరకు ఆయన కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు.

Published : 26 Jun 2024 18:37 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case) వ్యవహారంలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈడీ కేసులో బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను నేడు సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను కోర్టులో హాజరుపర్చగా.. కేసుకు సంబంధించిన సీఎం తన వాదనలను స్వయంగా వినిపించారు. ఈ కేసులో మనీశ్‌ సిసోదియా పేరు తానే చెప్పినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

‘‘లిక్కర్‌ పాలసీ కుంభకోణంలో మొత్తం పాత్ర మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)దే అంటూ వాంగ్మూలం ఇచ్చానని సీబీఐ (CBI) వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. సిసోదియాపై గానీ, ఇతర వ్యక్తులపై గానీ నేను ఎలాంటి నిందలు వేయలేదు. నేను, సిసోదియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ అంతా అమాయకులం. మీడియాలో మాపై దుష్ప్రచారం చేయాలని సీబీఐ ప్లాన్‌ చేస్తోంది. అందుకే విశ్వసనీయ వర్గాల పేరుతో నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసి సంచలనం సృష్టించాలని చూస్తోంది. దీనిపై స్పష్టత రావాలి’’ అని కేజ్రీవాల్‌ వాదించారు.

దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ అదుపులో సీఎం కేజ్రీవాల్‌

కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చిన తర్వాత సీబీఐ తమ వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలను ప్రైవేటీకరించాలని కేబినెట్‌ సహచరుడు (సిసోదియాను ఉద్దేశిస్తూ) సిఫార్సు చేశారని కేజ్రీవాల్‌ చెప్పినట్లు కోర్టుకు వెల్లడించింది. దీన్నే సీఎం ఖండించారు. ఈ కేసులో తనను సీబీఐ గతేడాది సాక్షిగా విచారించిన విషయాన్ని కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈ సందర్భంగా గుర్తుచేశారు. మద్యం విధానానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అప్పుడే దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు చెప్పారు.

ఈ వాదనల అనంతరం కేజ్రీవాల్‌ను కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. మరోవైపు ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు లభించిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతానికి ఆయన తిహాడ్‌ జైల్లోనే ఉండాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని