Hathras Stampede: నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్‌ ఘటనపై సిట్‌ చీఫ్‌

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు.

Published : 05 Jul 2024 17:09 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటన 121 మందిని బలిగొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఏడీజీ అనుపమ్‌ కురుక్షేత్ర తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులదే తప్పిదమని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సూచిస్తున్నాయని పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు.

‘‘తొక్కిసలాట ఘటనపై రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇప్పటికే సమర్పించాం. హాథ్రస్‌ డీఎం ఆశీష్‌ కుమార్‌, ఎస్పీ నిపుణ్‌ అగర్వాల్‌, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లను ఇందులో పొందుపర్చాం. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తును ముమ్మరం చేశాం. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలు.. నిర్వాహకుల అపరాధాన్ని సూచిస్తున్నాయి’’ అని ఏడీజీ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోలే బాబా ఆచూకీ లభించాల్సి ఉంది. కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని అలీగఢ్‌ ఐజీ శాలభ్‌ మాథుర్‌ గురువారం తెలిపారు.

24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!

ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. హాథ్రస్‌ జిల్లా సికంద్రరావ్‌ ప్రాంతం ఫుల్‌రయీ, ముగల్‌గఢీ గ్రామాల మధ్యలోని రహదారిని అనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తేలింది. జనం కిక్కిరిసి ఊపిరాడని కారణంగానే మరణాలు సంభవించాయని శవపరీక్షల్లో తేలిందని ఎటాలోని జిల్లా ఆసుపత్రి వైద్యులు ఇప్పటికే వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని