Zika Virus: వైద్యుడు సహా కుమార్తెకు జికా వైరస్‌

పుణెకు చెందిన ఓ వైద్యుడు సహా ఆయన కుమార్తెకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

Published : 26 Jun 2024 17:16 IST

పుణె: మహారాష్ట్రలో జికా వైరస్‌ కలకలం రేపింది. పుణెకు చెందిన ఓ వైద్యుడు సహా ఆయన కుమార్తెకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. అయితే, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదుకావడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు.. ఆ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చేపట్టారు.

పుణెకి చెందిన ఓ వైద్యుడు ఇటీవల జ్వరం బారిన పడ్డాడు. శరీరంపై దద్దుర్లు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. రక్త నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ఆ నగరంలోనే ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. జూన్‌ 21న వారికి జికా ఇన్‌ఫెక్షన్‌ నిర్ధరణ అయినట్లు స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు నిర్వహించారు. దాంట్లో ఆయన కుమార్తె (15)కు వైరస్‌ సోకినట్లు తేలింది. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు.

అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని చెప్పా: సుధామూర్తి

జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాల్లోనూ ఈ వ్యాధి ప్రబలింది. మొత్తంగా 2016 నాటికి 39 దేశాల్లో వ్యాధి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు