Mumbai: కోన్‌ ఐస్‌క్రీంలో మనిషి వేలు.. ముంబయి డాక్టర్‌కు చేదు అనుభవం

ఐస్‌క్రీముల్లో పురుగులు రావడం గురించే మనం విని ఉంటాం.. ఇప్పుడు మానవ అవయవాలు కూడా వస్తున్నాయి. ముంబయిలోని ఓ డాక్టర్‌కు ఈ అనుభవం ఎదురైంది.

Published : 13 Jun 2024 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మండుటెండల్లో ఎవరికైనా ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. కానీ, వాటిని ఎలా తయారు చేస్తారో అనే అందోళన చాలా మందిలో ఉంటుంది. గతంలో ఐస్‌క్రీమ్‌ల్లో పురుగులు కన్పించిన ఘటనలు చూశాం. కానీ, ఇప్పుడు మానవ అవయవాలు కూడా వస్తున్నాయి. ముంబయిలోని ఓ డాక్టర్‌ కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో ఏకంగా మనిషి వేలు వచ్చింది.

ముంబయి (Mumbai)కి చెందిన యువ డాక్టర్‌ ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్‌ పెట్టాడు. వారు కొనుగోలు చేసిన ‘ది యుమ్మో బటర్‌స్కాచ్‌’ ఫ్లేవర్‌ కోన్‌ ఐస్‌క్రీమ్‌లను ఆ సంస్థ డెలివరీ చేసింది. అతడు దానిని తినడం మొదలుపెట్టాక.. నాలుకకు ఏదో గట్టిగా తగలడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చి దానిని పరీక్షగా చూడగా.. 2 అంగుళాల మనిషి వేలు కన్పించింది. అతడు స్వయంగా డాక్టర్‌ కావడంతో వెంటనే దానిని ధ్రువీకరించుకోగలిగాడు. ఒక్కసారిగా అతడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. 

ఆ తర్వాత అతడు తేరుకొని మలాడ్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. అధికారులు కూడా వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకొన్నారు. దీనిపై పోలీసు సిబ్బంది మాట్లాడుతూ ఆ వేలును ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. ఇక ఆ ఐస్‌క్రీం తయారు చేసిన సంస్థ ప్రాంగణంలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆ ఐస్‌క్రీమ్‌ తయారీ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని