Dharmendra Pradhan: యోగా డే రోజున.. కేంద్రమంత్రికి చేదు అనుభవం

తనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం కావడంతో యోగా కార్యక్రమంలో పాల్గొనకుండా కేంద్రమంత్రి వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురైంది.

Published : 21 Jun 2024 10:46 IST

దిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) రోజున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకలకు హాజరుకావడానికి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంకావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. దిల్లీ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ముందుండి నడిపించాల్సింది. అయితే ఆయన రాకను అక్కడి విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. వారు నల్లజెండాలు ప్రదర్శించి ఆందోళన వ్యక్తంచేశారు. నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దాంతో చేసేదేమీ లేక మంత్రి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

యూజీసీ నెట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేంద్రం దానిని రద్దు చేసింది. మరోవైపు నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ పరిణామాల వేళ ప్రధాన్‌ స్పందిస్తూ.. నీట్‌ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని తెలిపారు. నీట్‌ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టంచేశారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని