Delhi rainfall: దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!

దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. 

Updated : 28 Jun 2024 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. గత 24 గంటల్లో సఫ్దార్‌జంగ్‌లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మి.మీ. కురిసింది. 

చాలా కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకొంది. స్పైస్‌జెట్‌ ఇప్పటికే తన ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. దక్షిణ దిల్లీలో గోవిందపురి ప్రాంతంలో వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. తీన్‌మూర్తి మార్గంలో కూడా వరద నీరు భారీ స్థాయిలో చేరింది. మింటో రోడ్డులో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. మరో వారం రోజులపాటు ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. జూన్‌ 30వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

నగరంలో చాలా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. శాంతివన్‌ నుంచి ఐఎస్‌బీటీ వరకు అవుటర్‌ రింగ్‌రోడ్డు రెండువైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయన్ని రక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని