Delhi airport: కూలిన టెర్మినల్‌ పైకప్పు.. అది మోదీ ప్రారంభించినది కాదు: రామ్మోహన్‌ నాయుడు

దిల్లీలోని విమానాశ్రయంలో జరిగిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Ram Mohan Naidu) స్పందించారు. విపక్షాలు చేస్తోన్న విమర్శలకు బదులిచ్చారు.

Updated : 28 Jun 2024 12:02 IST

Delhi airport T1 collapses | దిల్లీ:  దేశ రాజధాని దిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం కూలి, ట్యాక్సీలు సహా పలు కార్లపై పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Ram Mohan Naidu) స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన ఘటన అని వ్యాఖ్యానించారు.

Delhi airport: దిల్లీ విమానాశ్రయంలో కూలిన టెర్మినల్‌ పైకప్పు

‘‘ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు తెల్లవారుజామున కూలినది పాత భవనంలోని పైభాగం. దానిని 2009లో ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలివైపు ఉంది’’ అని వెల్లడించారు. కూలిన భాగంలోని కొన్ని బీమ్‌లు తుప్పుపట్టి ఉన్నాయని ప్రశ్నించగా.. ‘‘దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుంది. దీనిపై తనిఖీ చేయమని విమానాశ్రయ అధికారులను ఆదేశించాం. మంత్రిత్వ శాఖ, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తుంది’’ అని వెల్లడించారు. 

విమానాశ్రయంలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆ కూలిన టెర్మినల్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ‘‘గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యం ఈ దుస్థితికి కారణం’’ అని దుయ్యబట్టారు. ఈ విమర్శలను ఉద్దేశించే కేంద్రమంత్రి బదులిచ్చారు. అదంతా తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు. కూలిపోయిన ఈ టర్మినల్ పైభాగాన్ని 2008-09 సంవత్సరంలో నిర్మించారని తెలిపారు. 

మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం

ఈ ఘటనపై కేంద్రమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తరఫున మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం  ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇస్తామని వెల్లడించారు. అలాగే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆయన పరామర్శించారు. 

ఇక ఈ ఘటనతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వారు ప్రయాణించాల్సిన విమానాల గురించిన సమాచారం అందక గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో డీజీసీఏ విమానయాన సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటుచేయాలని, విమానాలు రద్దయితే టికెట్ రీఫండ్ ఇవ్వాలని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని