Cyber Crimes: అద్దెకు బ్యాంకు ఖాతాలు.. ప్రతి ₹లక్షకు రూ.1000 ఇస్తామని..

Cyber Crimes: మరో నయా మోసం బయటపడింది. సైబర్‌ నేరగాళ్లు తమ లావాదేవీలు సాగించేందుకు బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇందుకోసం యువతకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుంటున్నారు.

Published : 25 Jun 2024 00:07 IST

పనాజీ: సైబర్‌ నేరగాళ్ల (Cyber Fraudsters)కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టించి డబ్బు కాజేస్తున్న కేటుగాళ్లు.. ఇప్పుడు మరో మోసానికి తెరతీశారు. యువతకు డబ్బు ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలను అద్దె (Bank Accounts for Rent)కు తీసుకుంటున్నారు. వాటితో తమ లావాదేవీలు చాకచక్యంగా సాగిస్తున్నారు. గోవా పోలీసుల దర్యాప్తులో ఈ సంచలన విషయం బయటపడింది.

నిరుద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే యువతను సైబర్‌ నేరగాళ్లు వలలో వేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ‘‘కామన్‌ ఫ్రెండ్స్‌తో ఇలాంటి యువతను పరిచయం చేసుకుని బ్యాంకు ఖాతాలు (Bank Account) అద్దెకిస్తే డబ్బులిస్తామని ఆఫర్‌ చేస్తున్నారు. అలా రెంట్‌కు ఇచ్చిన వారికి ప్రతి రూ.లక్ష లావాదేవీకి రూ.1000 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఆ ఖాతాకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు (సంతకం చేసిన చెక్‌బుక్‌తో సహా) సైబర్‌ నేరగాళ్ల వద్దే ఉంటాయి. కొన్ని సార్లు అసలు ఖాతాదారులతోనే డబ్బు విత్‌డ్రా చేయిస్తున్నారు’’ అని గోవా పోలీసులు (Goa Police) వెల్లడించారు.

ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే కాజేశారు.. యూపీ పేపర్‌ లీకేజీలో విస్తుగొలిపే వాస్తవాలు

20-25 మధ్య వయసు గల యువత ఎక్కువగా ఇలా తమ బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అద్దెకు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి అకౌంట్‌లో జమ అయ్యే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో? ఎవరు పంపుతున్నారన్న విషయాలేవీ వారికి తెలియదని చెప్పారు. కేవలం డబ్బు కోసమే వారు ఈ పనికి అంగీకరించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. సైబర్‌ మోసాల (Cyber Crimes) సమయంలో కేసును పక్కదోవ పట్టించేందుకే కేటుగాళ్లు ఈ పంథా అనుసరిస్తున్నారని అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని