Atal Setu: అటల్‌ సేతుపై పగుళ్లు..! కాంగ్రెస్‌ ఆరోపణలపై అధికారులు ఏమన్నారంటే..

ముంబయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అటల్‌ సేతు’పై పెద్దఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు.

Published : 22 Jun 2024 00:14 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు (Atal Setu)’ను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇది అందుబాటులోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రోడ్డుపై పెద్దఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. వంతెన నిర్మాణాన్ని శుక్రవారం పరిశీలించిన ఆయన.. పనుల్లో నాణ్యత కొరవడటంతో ఈ దుస్థితి వచ్చిందని ఆరోపణలు చేశారు. అయితే.. అధికారులు వాటిని తిప్పికొట్టారు.

‘‘మూడు నెలల్లోనే అటల్ సేతుపై పగుళ్లు ఏర్పడ్డాయి. నవీ ముంబయి సమీపంలో అర కిలోమీటరు మేర ఇదే పరిస్థితి. ఈ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ, పనుల్లో అవినీతి చోటుచేసుకుంది’’ అని నానా పటోలే ఆరోపించారు. అయితే, దీన్ని అధికారులు ఖండించారు. ‘‘ప్రధాన వంతెనపై పగుళ్లు వచ్చాయంటూ వదంతులు వ్యాప్తి చేశారు. ఉల్వే నుంచి ముంబయి వైపు వంతెనను అనుసంధానించే అప్రోచ్ రోడ్డుపై అవి ఏర్పడ్డాయి. మరమ్మతులు చేపట్టాం’’ అని తెలిపారు. అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపాలని భాజపా మండిపడింది.

ఐఏఎస్‌ రోహిణి సింధూరి నా భూమిని ఆక్రమించారు: బాలీవుడ్‌ సింగర్‌ ఫిర్యాదు

ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ అటల్‌ సేతు (ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌)ను నిర్మించారు. రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా పనులు పూర్తి చేశారు. ముంబయి, నవీ ముంబయిల మధ్య ప్రయాణానికి ఇదివరకు రెండు గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15- 20 నిమిషాలకు తగ్గింది. మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపై ఉంది. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని