‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు

కొన్నేళ్లపాటు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ (Kerala)లోని కోర్టు విధించిన శిక్ష సంచలనం సృష్టించింది. 

Published : 02 Jul 2024 17:08 IST

దిల్లీ: కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ పైశాచికత్వం బయటపెట్టకూడదని బెదిరించడమే కాకుండా ఆరేళ్లపాటు మృగంలా ప్రవర్తించాడు. 16 ఏళ్ల వయసులో ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేరళలోని మల్లపురానికి చెందిన స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది. కేసు తీవ్రత దృష్ట్యా అతడికి 101 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్షనూ విధించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

పోక్సో, జువెనైల్ జస్టిస్‌ యాక్ట్‌ వంటి చట్టాల కింద గతవారం ఆ వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. ఈ క్రూరమైన నేర ప్రభావం ఆ బాలికపై జీవితాంతం ఉంటుందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘‘ఒక తండ్రిగా ఆ చిన్నారిని కాపాడాల్సిన వ్యక్తే.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చేవరకు పైశాచికత్వాన్ని కొనసాగించాడు. దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేం. నేరానికి పాల్పడిన వ్యక్తి ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అతడిపై ఎలాంటి కనికరం చూపలేం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ బాలిక తల్లి నిద్రిస్తున్న సమయంలోనో, ఆమె లేనప్పుడో ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అతడే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. కానీ తర్వాత ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం బయటపడిందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత మూడు నెలల గర్భాన్ని వైద్యులు తొలగించారు. డీఎన్‌ఏ పరీక్ష.. ఆ ఘటనకు కారకుడు ఎవరో ధ్రువీకరించింది. ఈ వివరాలన్నింటిని కోర్టు ముందు ఉంచడంతో..ఈ సంచలన తీర్పు వెలువడింది. బాధితురాలి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు