Kejriwal: దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ అదుపులో సీఎం కేజ్రీవాల్‌

Kejriwal: ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అదుపులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తాజాగా సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది.

Updated : 26 Jun 2024 14:35 IST

Kejriwal | దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి (CBI) కోర్టు బుధవారం అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తిహాడ్‌ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది. మద్యం కుంభకోణానికి (Delhi excise scam) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మద్యం కుంభకోణం కేసులో (Delhi excise scam) కేజ్రీవాల్‌కు (Kejriwal) బెయిల్‌ మంజూరుచేస్తూ ట్రయల్‌ కోర్టు గత గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ట్రయల్‌ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ.. దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్‌ అమలును నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రయల్‌ కోర్టు విఫలమైందని, బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని పేర్కొంది.

సుప్రీంలో పిటిషన్‌ వెనక్కి..

మరోవైపు హైకోర్టు స్టేను సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ (Kejriwal) సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. దీనిపై నేడు విచారణ చేపట్టింది. కాగా స్టేను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరగా.. అందుకు కోర్టు అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు. జిస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీతో కూడిన సెలవుకాల ధర్మాసనం అందుకు అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు