Congress: నీట్‌ వ్యవహారం.. ‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి: ఖర్గే డిమాండ్‌

NEET UG 2024| వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ (యూజీ) పరీక్షపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ¸కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 13 Jun 2024 17:08 IST

దిల్లీ: దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ(NEET) పరీక్ష వ్యవహారంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు, మోసాలు జరిగాయని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ పరీక్షలో గ్రేస్‌ మార్కుల సమస్య ఒక్కటే కాదన్న ఆయన.. ప్రశ్నపత్రం లీక్‌ అయిందని, అవినీతి జరిగిందంటూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ చర్యలతో నీట్‌ పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.

నీట్‌ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్‌ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి

పరీక్ష కేంద్రం, కోచింగ్‌ సెంటర్‌ కుమ్మక్కై ‘డబ్బు ఇవ్వండి.. పేపర్‌ తీసుకోండి’ అనే అవగాహన కుదిరిందని ఖర్గే ఆరోపించారు.  ఈ బాధ్యతను ఎన్‌టీఏపై నెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేదన్నారు. నీట్‌ పరీక్ష వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. దర్యాప్తు అనంతరం దోషుల్ని కఠినంగా శిక్షించాలని, లక్షలాది మంది విద్యార్థులకు నష్టం జరగకుండా చూసి పరిహారం చెల్లించాలన్నారు.  గత పదేళ్లలో పేపర్‌ లీకేజీలు, రిగ్గింగ్‌లతో కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఈ అంశంపై జనాగ్రహం పార్లమెంటులోనూ ప్రతిధ్వనిస్తుందని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగొయ్‌ అన్నారు.

పేపర్‌ లీకేజీపై ఆధారాల్లేవు.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీక్‌ అయిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఎన్‌టీఏపై అవినీతి ఆరోపణలు కూడా నిరాధారమైనవేనన్నారు. ఆ సంస్థ విశ్వసనీయమైందని దిల్లీలో ఆయన విలేకర్లతో అన్నారు. నీట్‌ పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని.. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగనివ్వకుండా చూస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని