Rahul Gandhi: సభలో రాహుల్ గాంధీ మైక్‌ మ్యూట్ చేశారు.. కాంగ్రెస్ ఆరోపణలు

లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. నీట్ పేపర్‌ లీక్‌ అంశాన్ని లేవనెత్తారు. ఆ సందర్భంలో ఆయన మైక్ ఆఫ్ అయిందని కాంగ్రెస్ ఆరోపించింది.  

Published : 28 Jun 2024 15:25 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్ పేపర్ లీక్‌’ (NEET Paper Leak) వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దానికిముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ అంశం లేవనెత్తగానే మైక్‌ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్‌) వేదికగా ఒక వీడియోను షేర్‌ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ కోరడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది.

‘‘నీట్‌పై ప్రధాని మోదీ ఏం మాట్లాడటం లేదు. సభలో యువత తరఫున రాహుల్ తన గొంతు వినిపిస్తున్నారు. కానీ అలాంటి తీవ్రమైన అంశంలో కూడా మైక్‌ ఆఫ్ చేయడం వంటి చౌకబారు పనులకు పాల్పడి, యువత గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్ తన ఖాతాల్లో రాసుకొచ్చింది. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్‌ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద లేదని స్పీకర్ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని వెల్లడించారు.

నీట్ వివాదంపై చర్చ జరగాలని, దీనిపై కేంద్రం ప్రకటన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ సమస్య.. దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్‌ ఇవ్వాలి’’ అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు