PM Modi: మీ చిరునవ్వుతో సభలో ఆనందం: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు

PM Modi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా నూతన ఎంపీలకు స్ఫూర్తినిస్తారని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన చిరునవ్వు సభను ఆనందంగా ఉంచుతుందని అన్నారు.

Published : 26 Jun 2024 12:41 IST

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా (Om Birla) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు స్పీకర్‌గా ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘‘వరుసగా రెండోసారి స్పీకర్‌ (Lok Sabha Speaker)గా ఎన్నికైన మీకు (ఓం బిర్లా) లోక్‌సభ సభ్యులందరి తరఫున శుభాభినందనలు. గత కొన్ని దశాబ్దాలుగా సభాపతిగా పనిచేసిన వారంతా ఎలాంటి పోటీని ఎదుర్కోలేదు. మీరు ఎన్నికలో గెలిచి చరిత్ర సృష్టించారు. స్పీకర్‌ పదవి ఎంత కఠినమైందో మీకు బాగా తెలుసు. చాలా మంది లోక్‌సభ సభ్యులకు మీతో పరిచయం ఉంది. సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌ది కీలక పాత్ర. లోక్‌సభ చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహించారు. గత ఐదేళ్లలో స్పీకర్‌గా మీ పదవీకాలంలో సభ 97శాతం పనిచేసింది. పాతికేళ్లలోనే ఇది అత్యధికం కావడం విశేషం. కొవిడ్‌ సమయంలోనూ సభ సజావుగా సాగేలా చూశారు. సభా మర్యాదను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అనేక కీలక బిల్లును ఆమోదించారు. వచ్చే ఐదేళ్లూ సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉంది. కొత్త ఎంపీలకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. మీ మధురమైన చిరునవ్వుతో సభ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని మోదీ (Narendra Modi) ప్రశంసలు కురిపించారు.

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..

విపక్షాల గళాన్ని అనుమతించాలి: రాహుల్‌

అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. ‘‘ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలి. ప్రభుత్వానికి రాజకీయంగా బలం ఉండొచ్చు.. కానీ విపక్షాలు ప్రజావాణికి ప్రాతినిధ్యం వహిస్తాయి. సభ సజావుగా నడపడంలో ప్రతిపక్షం మీకు పూర్తి సహకారం అందిస్తుంది. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు విపక్షాలకు అవకాశమిస్తారని ఆశిస్తున్నా. విపక్షం గొంతు నొక్కడం ద్వారా సభను నడపటం అప్రజాస్వామికం అవుతుంది. మాకు మాట్లాడే అవకాశం ఇస్తారని విశ్వాసంగా ఉన్నాం’’ అని రాహుల్‌ అన్నారు. పలువురు విపక్ష నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. స్పీకర్‌గా ఓం బిర్లా (Om Birla) సభలో పక్షపాతం లేకుండా వ్యవహరించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు.

మోదీ, రాహుల్‌ షేక్‌హ్యాండ్‌..

సభాపతిగా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించిన తర్వాత.. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ ఆయన వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనను స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా మోదీ, రాహుల్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని