Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

చెన్నై నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ కలకలం సృష్టించింది.

Published : 01 Jun 2024 13:47 IST

ముంబై: చెన్నై (Chennai) నుంచి ముంబయి(Mumbai) బయల్దేరిన ఇండిగో విమానాని(IndiGo flight)కి బాంబు బెదిరింపు(bomb threat) కలకలం సృష్టించింది. దీంతో వెంటనే విమానాన్ని ముంబయిలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 6.50 గంటలకు 172 మంది ప్రయాణికులు, సిబ్బందితో చెన్నై నుంచి ఇండిగో విమానం ముంబయికి బయల్దేరింది. కొద్దిసేపటికి విమానంలో బాంబు ఉందనే బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. విమానంలో ఓ రిమోట్‌ సైతం లభ్యమైంది. వెంటనే స్పందించిన పైలట్లు ముంబయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే సమయానికి ముంబయి విమానాశ్రయ అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను క్షేమంగా దించేశారు. అనంతరం రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్‌ సిబ్బంది.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమాన్ని టెర్మినల్ ప్రాంతంలో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. 

ఇదే విధంగా గత వారం దిల్లీ నుంచి వారణాసికి వెళ్లనున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టేకాఫ్‌ కాకముందే ఈ బెదిరింపు రావడంతో అప్రమత్తమైన అధికారులు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా దిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులను దించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని