Jharkhand CM: ఝార్ఖండ్‌ సీఎం చంపాయీ సోరెన్‌ రాజీనామా

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు అందించారు.

Updated : 03 Jul 2024 20:24 IST

రాంచీ: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు అందించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయడంతో చంపాయీ సోరెన్‌ ఆ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. హేమంత్‌కు రాంచీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి  ఇటీవల ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో చంపాయీ సోరెన్‌ నివాసంలో సమావేశమైన జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్‌ సోరెన్‌ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ నేపథ్యంలో హేమంత్‌ కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం చంపాయీ సోరెన్‌ తన రాజీనామాను గవర్నర్‌కు అందజేశారు.  ఈ సందర్భంగా రాజ్‌ భవన్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. జేఎంఎం కూటమి తీసుకున్న నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ కూటమి బలంగా ఉందని చెప్పారు. హేమంత్‌ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు నాకు బాధ్యతలు అప్పగించాయి. ఇప్పుడు కూటమి హేమంత్ సోరెన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది’’ అని తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను హేమంత్‌ కోరినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని