Bullet Train: దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్లు.. సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం..!

దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్లను విస్తరించేలా మోదీ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Published : 27 Jun 2024 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైల్‌ (Bullet Train) కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ఇవి జరగనున్నాయి’’ అని పేర్కొన్నారు.  

సరికొత్త భారత్‌ ముఖ చిత్రాన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలు మార్చేస్తాయని తెలిపారు. ఇప్పటికే మొదలైన అహ్మదాబాద్‌ - ముంబయి హైస్పీడ్‌ రైలు వ్యవస్థ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాదాపు 508 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌ దేశంలోనే మొదటిది. సాధారణంగా బుల్లెట్‌ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ లెక్కన రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో ఇది పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో సూరత్‌, వడోదరలో దీనికి స్టాప్‌లు ఉన్నాయి.

ది నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో తొలిఫేజ్‌లో సూరత్‌-బిల్మోర మధ్య నిర్మాణాన్ని ఆగస్టు 2026 నాటికి పూర్తి చేయనున్నారు. తొలిదశలో ఆరు రైళ్లను జపాన్‌ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు ఉన్న మార్గంలో విఖ్రోలీ వద్ద 21 కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ రైలు మార్గం భూగర్భ సొరంగంలోనే ఉంటుంది. ఇందులో ఏడు కిలోమీటర్ల మార్గం సముద్రగర్భంలో సాగుతుంది. పర్వతాలను తొలుచుకుంటూ అయిదు కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు చొప్పున మొత్తం 12 రైల్వేస్టేషన్లు రానున్నాయి. బాంద్రాకుర్లా కాంప్లెక్సు వద్ద దాదాపు 10 అంతస్తుల లోతైన నిర్మాణం ఒకటి రానుంది. ఠాణే-వాపీ మధ్య ఎత్తయిన కారిడార్‌ పనులూ వేగంగా సాగుతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని