Examination: ‘నెట్‌, నీట్‌’ వివాదం వేళ.. పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం కమిటీ

Examination: నెట్‌, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజ్‌ వ్యవహారం నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది.

Published : 22 Jun 2024 15:57 IST

దిల్లీ: నీట్‌ యూజీ (NEET UG), యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీకేజీపై పెనుదుమారం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ (Former ISRO chief K Radhakrishnan) నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.

ఈ కమిటీలో ఎయిమ్స్‌ దిల్లీ మాజీ డైరెక్టర్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కె.రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ దిల్లీ డీన్‌ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.

పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా

ప్రవేశపరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీ (High Level Committee)ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో పురోగతి, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. రెండు నెలల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం తెలిపింది.

ఇటీవల నీట్‌, నెట్‌ ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అవడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది.    దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా నేరంగా పరిగణిస్తారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని