Surrogacy: సరోగసీతో పిల్లల్ని పొందినా.. ఆరు నెలల మాతృత్వ సెలవులు

సరోగసీ (Surrogacy)తో బిడ్డను పొందిన తల్లులకు ఇక ఆరు నెలల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. ఈ మేరకు కేంద్రం నిబంధనల్లో సవరణలు చేసింది. 

Published : 24 Jun 2024 17:44 IST

దిల్లీ: సరోగసీ (Surrogacy) ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల (commissioning mother) కోసం కేంద్రం ఓ వెసులుబాటు తీసుకువచ్చింది. అలా సంతానాన్ని పొందిన ఉద్యోగినులకు ఆరు నెలల మాతృత్వ సెలవులు ఇవ్వనుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్(లీవ్‌) రూల్స్‌(1972)లో సవరణలు చేసింది. అలాగే ఆ బిడ్డ తండ్రి (commissioning father) 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పించింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీ (Surrogacy)తో సంతానాన్ని పొందితే వారికి 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే ఈ వీటిని పొందొచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి ఆరునెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు. ఇప్పటివరకు ఉన్న రూల్స్‌ ప్రకారం..ఉద్యోగిని, ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీస్‌లో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవులుగా పొందుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 18న కేంద్రం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది.

చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదేళ్లు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు. భార్యకు 23-50ఏళ్ల లోపు వయసు, భర్తకు 26-55ఏళ్ల వయసు ఉండి  సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఆ దంపతులు సరోగసీ విధానంలో బిడ్డను పొందవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని