CBI: ‘యూజీసీ-నెట్‌’ అవకతవకలపై దర్యాప్తు.. సీబీఐ బృందంపై స్థానికుల దాడి!

‘యూజీసీ-నెట్‌’ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తులో భాగంగా బిహార్‌లోని నవాదాకు వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు.

Published : 23 Jun 2024 22:52 IST

పట్నా: ‘యూజీసీ-నెట్‌ (UGC-NET)’ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తులో భాగంగా బిహార్‌లోని నవాదాకు వెళ్లిన సీబీఐ (CBI) బృందంపై స్థానికులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. దర్యాప్తు సంస్థ ఫిర్యాదు మేరకు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

యూజీసీ- నెట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సూచన మేరకు సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా అధికారుల బృందం నవాదాలోని కసియాడీహ్‌ గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున స్థానికులు సీబీఐ వాహనాలను చుట్టుముట్టారు. అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో అధికారులు వెంటనే స్థానిక పోలీస్‌లకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు. ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, దాడి చేయడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేశారు.

ముగిసిన నీట్‌ రీ-ఎగ్జామ్‌.. దాదాపు సగం మంది గైర్హాజరు

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీలలో ప్రవేశాలకు కోసం ఈ నెల జూన్‌ 18న యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించారు. అయితే.. ఇందులో అవకతవకలు జరిగినట్టు యూజీసీ నిర్ధారణ మేరకు దాన్ని రద్దు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని