CBI: విచారణకు కేజ్రీవాల్‌ సహకరించడం లేదు : సీబీఐ

మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (55) విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.

Published : 30 Jun 2024 06:16 IST

జులై 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ 

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (55) విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నట్లు రిమాండ్‌ దరఖాస్తులో ఫిర్యాదు చేసింది. మూడు రోజుల కస్టడీ విచారణ ముగియడంతో శనివారం సీబీఐ ఆయనను కోర్టులో హాజరుపరిచింది. విచారణ కొనసాగుతున్న దృష్ట్యా ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన కేజ్రీవాల్‌ను మరో 14 రోజులు జైలులో ఉంచాల్సిన అవసరముందని కోర్టుకు విన్నవించింది. ఆయన సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే దిల్లీలో మద్యం వ్యాపారానికి సంబంధించిన వివిధ వాటాదారులతో తన సహాయకుడైన విజయ్‌ నాయర్‌ జరిపిన సమావేశాలకు సంబంధించి కేజ్రీవాల్‌ ఎటువంటి సమాధానాలు ఇవ్వడం లేదని తెలిపింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో జరిపిన భేటీలపై కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయినట్లు పేర్కొంది. మరికొన్ని కీలకమైన సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉందని, దస్తావేజులను సేకరించాల్సి ఉన్నట్లు సీబీఐ కోర్టుకు నివేదించింది. ఈ అభ్యర్థనలను ఆమోదిస్తూ కేజ్రీవాల్‌ను జులై 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతున్నట్లు దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగియగానే ఆయనను మళ్లీ కోర్టులో హాజరుపరచాల్సిందిగా ప్రత్యేక జడ్జి సునేనా శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘నిందితుడి (కేజ్రీవాల్‌)పై ఆరోపించిన అభియోగాల మేరకు మద్యం పాలసీ రూపకల్పన, అమలులో పెద్దసంఖ్యలో ఇతర వ్యక్తులు కూడా ఉన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నాం. అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించడంలో సహాయకులుగా వారంతా వ్యవహరించారు. కాబట్టి, జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం’’ అని జడ్జి ఆదేశాల్లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని