NEET Row: నాలుగు దశల్లో దర్యాప్తు

నీట్‌(యూజీ-2024) పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలను నిర్ధారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇందుకోసం మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు జరపనుంది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ, దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలకు వాటిని ఎలా పంపించారు..

Updated : 25 Jun 2024 06:16 IST

బిహార్, గుజరాత్, రాజస్థాన్‌లలో సాక్ష్యాల సేకరణ
నీట్‌(యూజీ) కేసుపై సీబీఐ దూకుడు

దిల్లీ: నీట్‌(యూజీ-2024) పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలను నిర్ధారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇందుకోసం మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు జరపనుంది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ, దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలకు వాటిని ఎలా పంపించారు.. అనే అంశంతోపాటు పరీక్షల నిర్వహణ అంశంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) నిబంధనలను కచ్చితంగా పాటించిందా.. గోప్యతకు భంగం వాటిల్లే విధంగా ఎక్కడైనా ఉల్లంఘనలకు పాల్పడిందా.. నీట్‌-యూజీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించినందున సాంకేతికంగా ఏమైనా చొరబాటు జరిగిందా.. అనే దిశల్లో విచారించనుంది.

నీట్‌ పరీక్ష పత్రం రూపకల్పన నుంచి ప్రింటింగ్, రవాణా, పరీక్షలకు ముందు వాటికి భద్రత కల్పించిన వారందరినీ అవసరం మేరకు విడివిడిగా సీబీఐ విచారించే అవకాశముంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కేసుల్లో మొత్తం 1000 మంది పేర్లు, వారి మొబైల్‌ నంబర్లను సీబీఐ జల్లెడ పడుతోంది. పరీక్ష పత్రాల లీకేజీతో వారికి ఏమైనా సంబంధం ఉందేమో గమనిస్తోంది. దర్యాప్తులో భాగంగా బిహార్, గుజరాత్, రాజస్థాన్‌లలోని 5 కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. బిహార్, గుజరాత్‌లలో ఒక్కో కేసును, రాజస్థాన్‌లో మూడు కేసులను సీబీఐ మళ్లీ నమోదు (రీరిజిస్టర్‌) చేసింది. మహారాష్ట్రలోని కేసునూ తీసుకోనుంది.

దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ-24ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు నెట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించగా 9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు.

బిహార్‌లో..

పట్నా: నీట్‌(యూజీ)లో అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ బృందం సోమవారం బిహార్‌ రాజధాని పట్నాలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగాన్ని (ఈవోయూ) సందర్శించి సాక్ష్యాలను సేకరించింది. ఇప్పటిదాకా ఈవోయూ చేసిన దర్యాప్తు తీరుతెన్నులను పరిశీలించింది. ఈ కేసులో అరెస్టయిన 18 మంది వివరాలను సేకరించింది. నిందితులంతా ప్రస్తుతం పట్నా జైలులో ఉన్నారు. వారిని దిల్లీకి సీబీఐ తీసుకెళ్లి మరింత లోతుగా ప్రశ్నించే అవకాశముంది. మరోవైపు సాక్ష్యాల విధ్వంసం, ఆదాయానికి మించిన ఆస్తులకు (డీఏ) సంబంధించి పలు కేసులను సీబీఐ నమోదు చేయనుంది. దానాపుర్‌ మున్సిపాలిటీలో జూనియర్‌ ఇంజినీరుగా పని చేస్తున్న సికందర్‌ ప్రసాద్‌ యాదవేందుపై డీఏ కేసును సీబీఐ పెట్టనుంది.  

మహారాష్ట్రలో నలుగురిపై కేసు

లాతుర్‌: నీట్‌(యూజీ) అక్రమాలకు సంబంధించి మహారాష్ట్రలోని లాతుర్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులతోపాటు నలుగురిపై ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. నిందితుల్లో సంజయ్‌ తుకారాం జాదవ్, జలీల్‌ ఖాన్‌ ఉమర్‌ ఖాన్‌ పఠాన్‌ ఉన్నారు. నాందేడ్‌కు చెందిన మష్నాజీ కొంగల్వావ్, దిల్లీకి చెందిన గంగాధర్‌పైనా కేసు నమోదైంది. వీరిలో పఠాన్‌ను ఆదివారం రాత్రి ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. 


దిల్లీలో విద్యార్థుల ఆందోళన

దిల్లీ: నీట్‌(యూజీ)లో అక్రమాలను నిరసిస్తూ సోమవారం పార్లమెంటుకు మార్చ్‌ నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంత మంది ఎన్‌ఎస్‌యూఐ నాయకులున్నారు. నీట్‌(యూజీ)ను రద్దు చేయాలని కోరుతూ జంతర్‌మంతర్‌ నుంచి వారు ఈ ర్యాలీకి సిద్ధమయ్యారు. ప్లకార్డులతోపాటు జెండాలను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ఆందోళన సందర్భంగా దిల్లీ పోలీసులతోపాటు పారా మిలిటరీ బలగాలను మోహరించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పలు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని